ఎన్నిసార్లు ఎంత ఘనంగా సంకల్పం చెప్పుకున్నా మన పార్లమెంటును సజావుగా నడపడం ప్రభుత్వాలకు సాధ్యం కావడం లేదని మళ్లీ రుజువైంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యేసరికి మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ ఘనవిజయం సాధించి ఉంది. సమావేశాలు ముగిసే రోజున జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. వాటిల్లో సైతం ఆ పార్టీ మంచి పనితీరును ప్రదర్శించింది.
ఈ ఎన్నికలన్నిటా కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. ఆ రకంగా కేంద్రంలో పాలకపక్షం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటపుడు పార్లమెంటును నడపడం దానికి కష్టం కాకూడదు. లోగడ యూపీఏ సర్కారు ఉన్నప్పుడు వాయిదాల ప్రమేయం లేకుండా ఒక్కరోజు కూడా పార్లమెంటును సజావుగా నిర్వహించలేకపోయింది. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయాలన్న డిమాండు కోసం ఒక సందర్భంలో మొత్తంగా సమావేశాలే చాపచుట్టుకుపోయాయి. ఇప్పుడు సైతం అవే దృశ్యాలు కనబడటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇందుకు ఎవరినో తప్పుబట్టడం కంటే ఆత్మవిమర్శ చేసుకోవడం బీజేపీకి తక్షణావసరం.
ఆ సంగతలా ఉంచి...నరేంద్ర మోదీ సర్కారు ఈ సమావేశాల్లో ఆమోదం పొంది ఉండాల్సిన రెండు ప్రధాన బిల్లుల స్థానంలో శుక్రవారం రెండు ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చింది. ఈ రెండూ అత్యంత కీలకమైనవి. ఒకటి బీమా రంగంలో ఇప్పుడున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను 26 శాతంనుంచి 49 శాతానికి పెంచడానికి వీలు కల్పించేదైతే...రెండోది రద్దయిన బొగ్గు క్షేత్రాల పునఃవేలం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి సంబంధించింది. ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా చట్టసభలు ఉన్నతమైనవనీ... వాటిని విస్మరించి ఆర్డినెన్స్‌ల ద్వారా పాలిద్దామని భావించడం రాజ్యాంగ విరుద్ధమనీ 1986లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. రాజ్యాంగం ప్రకారం చట్టాలు చేయాల్సింది శాసనవ్యవస్థే తప్ప కార్యనిర్వాహకవ ర్గం కాదని ఆ సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది.
చట్టసభల నిర్వహణ సాధ్యపడని ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకోవాలని రాజ్యాంగంలోని 123వ అధికరణం కూడా సూచిస్తున్నది. కేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి వ్యవహరించాల్సి ఉంటుందని చెబుతూనే... ఆర్డినెన్స్ జారీ అత్యవసరమన్న అంశంలో ఆయన ముందుగా సంతృప్తి చెందాల్సి ఉంటుందని కూడా అన్నది. వాస్తవానికి ఆర్డినెన్స్‌లు జారీచేయడం దొడ్డిదారి పాలనతో సమానం. బ్రిటిష్ వలస పాలకులు తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం ఈ ఆర్డినెన్స్ విధానాన్ని చట్టబద్ధం చేశారు. ఏ ప్రజాస్వామిక దేశంలోనూ ఇలాంటి పద్ధతి ప్రస్తుతం అమలులో లేదు. కాలం చెల్లిన చట్టాలను తొలగించడానికి నడుం బిగించిన మోదీ సర్కారు ఇలాంటి అప్రజాస్వామిక చట్టాల ఆధారంగా ఆర్డినెన్స్‌లను జారీచేయడానికి పూనుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
వాస్తవానికి బొగ్గు క్షేత్రాల పునఃవేలం అత్యవసరమైనదే. వాటి కేటాయింపులో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతున్నందున రెండేళ్లనుంచి అనేక పరిశ్రమలు అనిశ్చితిలో పడ్డాయి. మార్చి 31లోగా బొగ్గు క్షేత్రాల పునఃవేలం ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుందని, అందులో మళ్లీ ఆ క్షేత్రాలను సొంతం చేసు కున్న సంస్థలకే చోటుంటుందని, మిగిలినవాటికి అవి రద్దవుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కనుక వేలం ప్రక్రియ ప్రారంభించడం ముఖ్యమే. బీమా బిల్లుకు సంబంధించినంత వరకూ వామపక్షాలు మినహా ఇతర పార్టీలేవీ దాన్ని వ్యతిరేకిం చడంలేదు. రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సిన ఈ బిల్లుపై ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒక అవగాహనకొచ్చాయి.
అయితే, మత మార్పిళ్ల వ్యవహారంలో ప్రధాని హామీ ఇవ్వాలన్న విపక్షాల డిమాండును అంగీకరించని కారణంగా ఏర్పడ్డ పరిణామాలవల్ల ఇలా అంగీకారం కుదిరిన బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టలేని స్థితిలో ప్రభుత్వం పడింది. బొగ్గు క్షేత్రాల వేలం గురించి అయితే ఆర్డినెన్స్ అవసరం ఉన్నదనుకున్నా బీమా రంగంలో ఎఫ్‌డీఐల పెంపు విషయం దాదాపు ఆరేళ్లుగా నానుతున్న సమస్య. అది మరికొన్ని నెలలు వాయిదా పడితే వచ్చే నష్టమేమీ లేదు. కానీ, ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మనం వెనక్కి తగ్గబోమని ప్రపంచానికి చాటడం కోసమే బీమా బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకొచ్చామని ప్రభుత్వం అంటున్నది.
బీమా రంగంలో ఎఫ్‌డీఐల పెంపు వివాదాస్పదమైన అంశం. దాన్ని ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ వంటి కార్మిక సంఘాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. జీవిత బీమా, ఇతరత్రా బీమా రంగాల్లో ప్రస్తుతం 52 కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇందులో 5 మాత్రమే ప్రభుత్వరంగసంస్థలు. భారత్‌లో 36 కోట్లమంది జీవిత బీమా పాలసీదారులున్నారని ఈమధ్యే సిగ్మా నివేదిక వెల్లడించింది. బీమా రంగంలో సంస్కరణలు మొదలై దశాబ్దం దాటుతున్నా ప్రభుత్వరంగ సంస్థ ఎల్‌ఐసీదే అందులో ఆధిపత్యం. ఈ మార్కెట్‌లో దాని వాటా 71 శాతం. పార్లమెంటులో బీమా బిల్లును పెట్టి చర్చలు సాగనిస్తే ఈ విషయంలో ఎవరి వాదన ఏమిటో దేశ ప్రజలకు తెలుస్తుంది.
ఆ నిర్ణయంలోని మంచిచెడ్డలపై కూడా ఒక అవగాహనకు రాగలుగుతారు. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి అంశాలను పార్లమెంటు ఆమోదంతో అమల్లోకి తీసుకురావడం ప్రజా స్వామ్య వ్యవస్థకు ఆరోగ్యకరం. ఇప్పుడు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత ఏర్పాటు కాదని... ఒకవేళ ఆర్డినెన్స్ మురిగి పోతే తమ పెట్టుబడులు అనిశ్చితిలో పడతాయని విదేశీ సంస్థలకు తెలియదా? నరేంద్ర మోదీ సర్కారు పార్లమెంటులో చర్చించడం ద్వారా, అందరినీ కలుపుకొని వెళ్లడంద్వారా కీలకమైన నిర్ణయాలు తీసుకునే సత్సంప్రదాయానికి శ్రీకారం చుడితే బాగుండేది. అలా చేయకపోవడమే కాంగ్రెస్ ప్రస్తుత దుస్థితికి కారణమని పాలకులు గ్రహించాలి.
ఆర్డినెన్స్ పాలన!
Published Sat, Dec 27 2014 1:36 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement