‘నోటు’పై హోరాహోరీ!
పెద్ద నోట్ల రద్దు పర్యవసానంగా పౌరులంతా బజారునపడిన వేళ బుధవారం పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సరిహద్దు ఆవల మన సైన్యం సర్జికల్ దాడులు నిర్వహించి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన ఘటన ఈ సమావేశాల్లో ప్రముఖంగా చర్చకొస్తుందని అందరూ అంచనా వేస్తున్న సమయంలో ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ ఉరుములేని పిడుగులా పెద్ద నోట్ల రద్దు సంగతిని ప్రకటించారు. మరో రెండు, మూడు గంటల్లో ఆ నోట్లన్నీ చిత్తు కాగితాలతో సమానం కాబోతున్నాయని చెప్పి అందరిలో వణుకు పుట్టించారు. పల్లెసీమల సంగతేమోగానీ నగరాలు, పట్టణాల్లోని జనం అప్పటికప్పుడు ఏటీఎంల దగ్గరకు పరుగెత్తారు.
వాటిలో సైతం ‘కాబోయే చిత్తు కాగితాలు’ బయట కొస్తుంటే తలలు పట్టుకున్నారు. మోదీ ప్రకటనలోని ఆంతర్యాన్ని తెలుసు కోలేని వారు ఆ రోజుకు టీవీలు కట్టేసి కంటినిండా నిద్రపోయి ఉండొచ్చుగానీ... తెలతెలవారాక పాల ప్యాకెట్‌లు అమ్మేవారు ఇది చిత్తుకాగితమని చెప్పేసరికి తెల్ల బోయారు. అప్పటికీ తెలివి తెచ్చుకోనివారికి ఇతరచోట్ల జ్ఞానోదయమైంది. ఇక ఆ క్షణం నుంచి ఎవరికీ నిద్ర లేదు. వేరే వ్యాపకానికీ అవకాశం లేదు. అన్నీ మరిచి ఏటీఎంల దగ్గరా, బ్యాంకుల ముందూ పడిగాపులు పడటం తప్ప దిక్కూ మొక్కూ లేకపోయింది. ఆనాటినుంచీ పిల్లలూ, పెద్దలూ, పిల్లల తల్లులు, వికలాంగులూ, వృద్ధులూ... అందరికందరూ అన్నపానీయాలను మరిచి నిలువుకాళ్ల యజ్ఞం చేస్తున్నారు. గుండె ఆగి మరణించినవారు కొందరైతే, పాత నోట్లిస్తే వైద్యానికి నిరాకరించిన ఉదంతాల్లో మృత్యువాతపడినవారు మరికొందరు. తమ చర్యల ఆంతర్యం నల్లధనం పనిపట్టడమేనని ప్రభుత్వం వాదిస్తోంది.
ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాల్లో సహజంగానే నిప్పులు కురుస్తాయి. ప్రభుత్వం కూడా అందుకు సిద్ధపడుతోంది. జాతి విస్తృత ప్రయోజనాలరీత్యా ఈ నిర్ణయం విషయంలో ప్రభుత్వానికి సహకరించమని అఖిలపక్ష సమావేశంలో మోదీ విజ్ఞప్తి చేశారు. ‘మీ అభిప్రాయాలు వ్యక్తం చేయండి. చర్చించండి. వాదిం చండి. కానీ ఈ సమావేశాలను సజావుగా సాగనివ్వండ’ని ఆయన కోరారు. వాస్తవానికి ప్రధాన సమస్య పెద్ద నోట్ల రద్దుతోపాటు దేశాన్ని వేధిస్తున్న అంశాలు చాలానే ఉన్నాయి. జమ్మూ–కశ్మీర్ ఇంకా కుదుటపడలేదు. సాక్షాత్తూ ఢిల్లీలోనే ఉన్నతశ్రేణి విశ్వవిద్యాలయం జేఎన్‌యూలో ఒక విద్యార్థి మాయమై రోజులు గడుస్తున్నా ఆచూకీ లేదు. అదే నగరంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా ప్రొఫెసర్లకు ఛత్తీస్‌గఢ్ అడవుల్లో జరిగిన ఒక హత్యలో ప్రమేయం ఉన్నదంటూ నోటీసులు జారీ అయ్యాయి. ఇవిగాక ఎన్నికల్లో పార్టీలకు ప్రభుత్వం నిధులు సమకూర్చడం, ఏక కాలంలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం వంటివి అతి ముఖ్య మైన సమస్యలని కేంద్రం చెబుతోంది.
ఈ రెండింటినీ చర్చించాలనడాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఆ సందర్భంగా మన దేశంలో చట్టసభల పని తీరు ఎలా ఉంటున్నదో, అందులో ఎవరి పాపమెంతో... వాటిని సరైన తోవన పెట్టడం ఎలాగో కూడా నిగ్గుతేలిస్తే మంచిదే. ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ, విపక్ష సభ్యుల్ని సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్న పోకడలను చర్చిస్తే మేలే. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న ఈ ధోరణులకు ఎవరు బాధ్యతవహించాలో తేల్చడమూ అవసరమే. చర్చలో విమర్శలు, ప్రతివిమర్శలు మాత్రమే కాదు... ఆత్మవిమర్శ చేసుకోవడం కూడా అత్యవసరం. ఎన్నికల్లో పార్టీలకు నిధులు సమకూర్చడంపై చర్చ సాగాల్సిందే. కానీ అంతకన్నా ముందు ఆ ఎన్నికలకు విశ్వసనీయత కల్పించడమెలా అన్న విషయంపై దృష్టి కేంద్రీకరించాలి. నెగ్గడం కోసం నానాగడ్డీ కరవడం, అలవికాని హామీలివ్వడం, అధికారంలోకొచ్చాక వెన్ను పోటు పొడవటం ఎలాంటి నీతో... దానివల్ల మొత్తంగా ఎన్నికలంటేనే ఏవగింపు కలిగే స్థితి ఏర్పడటం ఎంత ప్రమాదకరమో చర్చించాలి. మిగిలినవన్నీ వాటి తర్వాతనే.
గత అనుభవాలు చూస్తే విపక్షాల ఏకైక వ్యూహం పార్లమెంటును సాగనీయ కుండా చేయడమేనని అర్ధమవుతుంది. సమావేశాలు చాపచుట్టుకుపోతే... పదే పదే అవి వాయిదాల్లో గడిచిపోతే దాన్ని తమ విజయంగా భావించడం రివాజు అయింది. ఇప్పుడు సైతం అలాగే వ్యవహరిద్దామనుకుంటే జనం మెచ్చరని... సభను స్తంభింపజేయడం కాక ‘ఎలాగైనా’ చర్చ సాగేలా చూడటం తక్షణావస రమని విపక్షాలు తెలుసుకోవాలి. మరోవైపు కీలకమైన సమస్యలు వచ్చిపడిన ప్పుడు చర్చను పక్కదోవ పట్టించే వ్యూహం ప్రభుత్వాలకు ఎటూ ఉంటుంది. హఠాత్తుగా మరేదో సమస్యను తెరమీదికి తెచ్చి సభ దృష్టి మళ్లించిన సందర్భాలు యూపీఏ ప్రభుత్వ హయాంలో కోకొల్లలు. ఎన్‌డీఏ ప్రభుత్వం ఆ విషయంలో తన చిత్తశుద్ధిని చాటుకోవాల్సి ఉంది.
పార్లమెంటు సమావేశాలు ఎలా ఉండబోతాయో మంగళవారంనాటి పరిణా మాలే చెబుతున్నాయి. పరస్పరం తలపడే తృణమూల్, సీపీఎంలు రెండూ విపక్ష సమావేశానికి హాజరుకావడం, తామంతా పార్లమెంటులో ఉమ్మడి పోరుకు సిద్ధ పడుతున్నామని సంకేతాలివ్వడం కీలకమైన అంశమే అయినా...పెద్ద నోట్ల రద్దు ఉత్పాతంపై సమష్టిగా రాష్ట్రపతిని కలుద్దామన్న తృణమూల్ ప్రతిపాదనకు ఎవరూ సుముఖత చూపకపోవడం గమనించదగ్గది. అందుకు మరికాస్త సమయం తీసు కుందామన్న ఇతర పార్టీల సూచన ఆమెకు రుచించలేదు. మరోవైపు కేరళలో తమ ప్రభుత్వం చేస్తున్నట్టు బెంగాల్‌లో కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద నోట్ల స్వీకారానికి ముందుకు రావాలన్న సీపీఎం సూచనపైనా ఆమె ఎటూ తేల్చలేదు. అటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కాంగ్రెస్ నేతలు యూపీఏ హయాంలో 12 లక్షల కోట్లు కాజేశారని విమర్శించారు. కనుక ప్రధానంగా ఈ రెండు పక్షాల భుజ బలప్రదర్శనకూ ఈ సమావేశాలు వేదికవుతాయన్న అనుమానాలు తలెత్తుతు న్నాయి. అదే జరిగితే జనం క్షమించరు. తక్షణ సమస్యలపై చర్చించడం, సరైన పరి ష్కారాలను అన్వేషించడం, చట్టసభల ఔచిత్యాన్ని కాపాడటం ముఖ్యమని అన్ని పక్షాలూ గుర్తించాలి.