నేరాభియోగాలు ఉంటే పోటీకి అనర్హత!
న్యూఢిల్లీ: నేరస్థులను రాజకీయాలకు దూరంగా ఉంచే లక్ష్యంతో.. తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తూ చట్టం చేయాలని కేంద్ర న్యాయ మంత్రి కపిల్ సిబల్ కొత్త బిల్లును ప్రతిపాదించారు. దోషులుగా నిర్ధారితులైన ప్రజాప్రతినిధులకు తక్షణమే అనర్హత వర్తిస్తుందని, జైలు శిక్ష అనుభవించిన వారు ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హులంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది.
ఆ తీర్పును నిర్వీర్యం చేయటానికి కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురాగా.. రాహుల్‌గాంధీ ఆ ఆర్డినెన్స్ ఓ చెత్తకాగితమని, చించిపారేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేయటం, ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను, బిల్లును ఉపసంహరించుకోవటం విదితమే. అయితే.. హత్య, అత్యాచారం, అపహరణ వంటి తీవ్రమైన నేరాభియోగాలు (ఏడేళ్లు, అంతకన్నా ఎక్కువ శిక్ష పడగల నేరాలు) ఎదుర్కొంటున్న వారిని సైతం ఎన్నికల్లో పోటీచేయటానికి అనర్హులను చేస్తూ కొత్త చట్టం చేయాలని సిబల్ తాజాగా ప్రతిపాదిస్తుండటం విశేషం.