యూఎస్ ఫెడ్, ఆర్ బీఐ నిర్ణయాలే మార్కెట్ కు కీలకం!
హైదరాబాద్:
రిజర్వు బ్యాంక్ ద్రవ్య విధానం, యూఎస్ ఫెడరల్ రిజర్వు సమావేశాలే మార్కెట్ కదలికలకు కీలకంగా మారే అవకాశం ఉందని ఆర్ధిక రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూఎస్ ఫెడ్ సమావేశం సెప్టెంబర్ 17-18 తేదిన, రిజర్వుబ్యాంకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష సెప్టెంబర్ 20 తేదిన జరుగనున్నాయి. ట్రెజరీలలో నెలసరి కోనుగోళ్లను ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తగ్గించవచ్చని బ్రోకర్లు అంచనా వేస్తున్నారు.
అమెరికా ఆర్ధిక వ్యవస్థ కోలుకుంటున్నందున్న నిధులు తరలివెళ్లే అవకాశం ఉన్నందున భారత్ తోపాటు ఇతర మార్కెట్లపై స్వల్పకాలిక ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాక అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో రూపాయి క్షీణిస్తున్నందున మార్కెట్ లోకి నిధుల ప్రవాహంపై ఒత్తిడి పెరిగే సూచనలున్నాయని మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం.
ఫెడ్ రిజర్వు తీసుకోబోయే కీలక నిర్ణయాలపై రిజర్వు బ్యాంక్ నూతన గవర్నర్ రఘురాం రాజన్ దృష్టి సారించారు. ఫెడ్ రిజర్వు సమావేశం ఉన్నందున ద్రవ్య సమీక్ష సెప్టెంబర్ 18 తేది నుంచి సెప్టెంబర్ 20 తేదికి మార్చారు. అంతేకాక గవర్నర్ గా ఎన్నికైన తర్వాత రఘురాజన్ తొలి సమీక్షను నిర్వహిస్తున్న నేపథ్యంలో అందర్ని దృష్టి ఆయనే మీదే ఉంది.