
ఆవు గుండెతో హైదరాబాదీకి కొత్త జీవితం
చెన్నై: గుండె కవాటాలు దెబ్బతిన్న వృద్ధురాలికి గోమాత ఊపిరిలూదింది. తన గుండెతో ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. హైదరాబాద్‌కు చెందిన అల్లూరి సీతాయమ్మ(81) అనే వృద్ధురాలికి గత శనివారం చెన్నై మొగపేర్‌లోని ఫ్రాంన్టియర్ లైఫ్ లైన్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఆవు గుండె నుంచి తయారుచేసిన కవాటాలు ఆమెకు అమర్చారు.
వాల్వా ఇన్ వాల్వా ట్రాన్ స్కాథెటర్ ఎరొటిక్ వాల్వా రీప్లెస్‌మెంట్ (వీఐవీ-టీఎవీఆర్) అనే విధానంలో చికిత్సను విజయవంతం చేసినట్టు ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ కేమ్ చెరియన్ తెలిపారు. మహాధమని పూడుకుపోవడంతో 11 ఏళ్ల క్రితం ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అయితే ఈ ఏడాది ఆరంభం మరోసారి సమస్య తలెత్తడంతో ఆమె పలు ఆస్పత్రులు తిరిగారు.
ఆవు గుండెతో తయారు చేసిన కవాటాలు అమర్చి సమస్యను పరిష్కరించినట్టు ఫ్రాంన్టియర్ కార్డియాలజిస్ట్ అనంతరామన్ తెలిపారు. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో సీతాయమ్మ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు.