వారి ఆత్మహత్యలెందుకో తెలియదా?
సీఎంపై వాసిరెడ్డి పద్మ మండిపాటు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిజంగా తెలియదా? అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. సోమవారంనాడిక్కడ ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భేషరతుగా రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని, ఎవరూ కట్టక్కరలేదని ప్రచారం చేసి తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు రుణమాఫీ చేయనందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. వాటిపై ప్రతిరోజూ పేపర్లలో వస్తున్న వార్తలు చదవడం లేదా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు.
బ్యాంకుల్లో పేరుకు పోయిన పాత అప్పులు తీర్చలేక, కొత్త అప్పులు పుట్టక దిక్కు తోచని స్థితిలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న విషయం ముఖ్యమంత్రికి తెలియదా? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ తెలిసి కూడా రైతుల ఆత్మహత్యలకు వేరే కారణాలున్నాయని చెప్పాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు అధ్యయన కమిటీలు వేయాలని నిర్ణయించారని పద్మ దుయ్యబట్టారు.సింగపూర్‌లోని ప్రైవేటు సంస్థలకు ఇక్కడి భూములను అప్పగిస్తున్న చంద్రబాబు అందుకు ప్రతిఫలంగా అక్కడ (సింగపూర్)లో ఎలాంటి లబ్ధి పొందుతున్నారో చెప్పాలని వాసిరెడ్డి డిమాండ్ చేశారు.
చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి తీసుకున్న భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తోందని ఆమె విమర్శించారు. రాజధాని శంకుస్థాపన , ప్రచారార్భాటాల కోసం ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలకు కోట్లు ముట్టచెబుతున్నారని విమర్శించారు.