'బాబు అధికారంలోకి వస్తే బాదుడే'
హైదరాబాద్: చంద్రబాబు అధికారంలోకి వస్తే ఛార్జీల బాదుడే అని మరోసారి రుజువైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... విద్యుత్ ఛార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట... అధికారంలోకి వచ్చిన తర్వాత మరోమాట మాట్లాడుతున్నారని ఆరోపించారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు... ఇప్పుడు ఎందుకిలా వ్యవహరిస్తున్నారంటూ బాబును వాసిరెడ్డి పద్మ సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చకోకపోతే వైఎస్ఆర్ సీపీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వాసిరెడ్డి పద్మ చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.