వెంకయ్యకు బెజవాడలో చేదు అనుభవం
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి విజయవాడలో చేదు అనుభవం ఎదురైంది. మహిళా పారిశ్రామిక వేత్తలతో సదస్సులో పాల్గొనేందుకు గేట్వే హోటల్కు ఆయన వచ్చినప్పుడు.. హోటల్ బయట వామపక్షాల ఆధ్వర్యంలో భారీస్థాయిలో ఆందోళన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పించడంలో వెంకయ్య విఫలం అయ్యారంటూ నినదించారు. బీజేపీది మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదని సీపీఎం నాయకుడు బాబూరావు అన్నారు. ఎన్నికల ముందు పార్లమెంటులో ఏపీకి ఐదేళ్లు కాదు.. పదేళ్ల ప్రత్యేకహోదా కావాలని డిమాండు చేశారని, మోదీతో కలిసి ప్రచారంలో కూడా చెప్పారని ఆయన గుర్తుచేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా ఇవ్వాల్సిన రాయితీలు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.
ఆంధ్రావాడినని చెప్పుకోడానికి వెంకయ్య సిగ్గుపడాలని చెప్పారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసి కాంగ్రెస్ మోసం చేస్తే, బీజేపీ-టీడీపీ కలిసి రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా, ఇతర హక్కులు ఇవ్వకుండా నాశనం చేస్తున్నాయని విమర్శించారు. వెంకయ్య రోజుకో మాట మారుస్తున్నారని, రాష్ట్రానికి ప్రత్యేకహోదా అడిగే హక్కు లేదన్న ఆయనకు.. ఓట్లడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. కాగా, ఆందోళన చేస్తున్న వామపక్షాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.