ఆ వేడిలో.. ‘హోదా’ అన్నా
విజయవాడ సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి రూ. 4 వేల కోట్ల ప్రయోజనం మాత్రమే ఉంటుందని, ప్యాకేజీతో రూ. 2.25 లక్షల కోట్ల నిధులు వస్తాయని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీకి మించి మరో మార్గం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించి, ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పానన్నారు. శనివారం విజయవాడలో బీజేపీ నిర్వహించిన ప్యాకేజీ అవగాహన సభకు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్యాకేజీ ప్రకటనకు చొరవ చూపిన వెంకయ్యను రాష్ట్రానికి చెందిన బీజేపీ మంత్రులు, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. ‘‘విభజన బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందే సమయంలో అప్పటికి ఉన్న రాజకీయ వేడిలో తెలంగాణలో గొడవలు జరుగుతున్నాయి. బిల్లుపై చర్చించడానికి ఒక రోజు ఆలస్యం జరిగితేనే తెలంగాణలో పలుచోట్ల నా దిష్టిబొమ్మ తగలబెట్టారు. దీంతో ఏపీకి న్యాయం చేసేందుకు రాజ్యసభలో హోదా గురించి డిమాండ్ చే శాను’’ అని పేర్కొన్నారు.
ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు..
హోదా వస్తే రాత్రికి రాత్రే హైదరాబాద్‌లా మారిపోతుందని కొందరు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు. చంద్రబాబు విశాఖపట్నంలో ఒక సదస్సు పెడితే రూ. 4.25 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని, వాళ్ల్లు ఎవరూ ప్రతే ్యక హోదా కోసం రాలేదని చెప్పారు.
లోపాయికారీ ఏంటీ.. అది బహిరంగమే!
తాను చెప్పిన వెంటనే ప్యాకేజీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోగానే మా ఇద్దరి మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగినట్టు విమర్శలు చేస్తున్నారని వెంకయ్య తప్పుపట్టారు. అదేమీ లోపాయికారీ కాదని, బహిరంగమేనని చెప్పారు.
మండిపడిన వామపక్షాలు
విజయవాడ(రామవరప్పాడు): ప్రత్యేక హోదా అంశంలో ఆంధ్రులను నమ్మించి నట్టేట ముంచిన వెంకయ్య నాయుడుకు రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని వామపక్షాలు మండిపడ్డాయి. శనివారం విజయవాడవచ్చిన వెంకయ్యకు వామపక్షాలనుంచి గట్టి నిరసన ఎదురైంది. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఆయన వస్తున్నారని తెలుసుకున్న సీపీఎం, సీపీఐ శ్రేణులు పెద్ద ఎత్తున రామవరప్పాడు రింగ్ సెంటర్‌కు చేరుకున్నాయి. దీంతో పోలీసులు పలువురిని అరెస్టుచేశారు.