దర్శక, ఛాయాగ్రాహకుడు బాలూ మహేంద్ర ఇకలేరు! | Veteran filmmaker Balu Mahendra passes away | Sakshi
Sakshi News home page

దర్శక, ఛాయాగ్రాహకుడు బాలూ మహేంద్ర ఇకలేరు!

Published Thu, Feb 13 2014 12:38 PM | Last Updated on Sat, Aug 11 2018 8:29 PM

దర్శక, ఛాయాగ్రాహకుడు బాలూ మహేంద్ర ఇకలేరు! - Sakshi

దర్శక, ఛాయాగ్రాహకుడు బాలూ మహేంద్ర ఇకలేరు!

సుప్రసిద్ధ దర్శకుడు, ఛాయాగ్రాహకుడు బాలూ మహేంద్ర గురువారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్ను మూశారు. ఛాయాగ్రాహకునిగా, దర్శకునిగా ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు.

 సుప్రసిద్ధ దర్శకుడు, ఛాయాగ్రాహకుడు బాలూ మహేంద్ర గురువారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్ను మూశారు. ఛాయాగ్రాహకునిగా, దర్శకునిగా ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. శ్రీలంకలో పుట్టిన బాలూ మహేంద్రకు మొదటి నుంచీ సినిమాలంటే ఆసక్తి. ‘పని ముడక్కు’ అనే మలయాళ చిత్రంతో ఛాయాగ్రాహకునిగా ఆయన ప్రస్థానం మొదలైంది. చాలా తక్కువ చిత్రాలకు మాత్రమే ఆయన పని చేశారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 27 చిత్రాలకు ఆయన ఛాయాగ్రహణం సమకూర్చారు. వాటిని దృశ్యకావ్యాలుగా తీర్చిదిద్దడంలో ఆయన ప్రజ్ఞ అపారం.
 
  తెలుగులో ‘లంబాడోళ్ల రాందాసు’, మనవూరి పాండవులు, శంకరాభరణం, కలియుగ రావణాసురుడు, సొమ్మొకడిది సోకొకడిది తదితర చిత్రాలకు తన కెమెరాతో వన్నెలద్దారు. ‘కోకిల’ అనే కన్నడ చిత్రంతో దర్శకునిగా అవతారం ఎత్తారు. ఆ సినిమా ద్వారా ఉత్తమ ఛాయాగ్రాహకునిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. తను డెరైక్ట్ చేసిన సినిమాలకు దాదాపుగా తనే ఛాయాగ్రహణం చేసుకున్నారు. కమలహాసన్, శ్రీదేవితో తమిళంలో తీసిన ‘మూండ్రాం పిరై’ ఆయనకు దర్శకునిగా ఎనలేని కీర్తి ప్రతిష్టలను ఆర్జించి పెట్టింది. కమలహాసన్‌కు ఉత్తమ నటునిగానూ, బాలూమహేంద్రకు ఉత్తమ ఛాయాగ్రాహకునిగానూ ఈ సినిమా ద్వారా జాతీయపురస్కారాలు లభించాయి.
 
  శ్రీదేవి తన కెరీర్‌లో టాప్ టెన్ సినిమాల్లో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. ఈ చిత్రాన్నే తెలుగులో ‘వసంత కోకిల’గా అనువదించారు. దీన్నే హిందీలో ‘సద్మా’గా రీమేక్ చేసి, బాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకున్నారు. తెలుగులో బాలూ మహేంద్ర డెరైక్ట్ చేసిన ఏకైక చిత్రం ‘నిరీక్షణ’. భానుచందర్, అర్చన నటించారు. ఆయన తమిళంలో దర్శకత్వం చేసిన ‘వీడు’ చిత్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ సినిమా ద్వారా అర్చనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది. బాలూ మహేంద్ర మొత్తం 22 చిత్రాలకు దర్శకత్వం చేశారు. ఆయనకు భార్య అఖిల, కొడుకు సంగీ మహేంద్ర ఉన్నారు. ఆయన మృతికి యావత్ దక్షిణాది చిత్రపరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. బాలూ మహేంద్ర భౌతికకాయానికి శుక్రవారం ఉదయం చెన్నైలో అంత్యక్రియలు జరుగనున్నాయి.
 
 సినీ ప్రముఖుల నివాళి: తమిళ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శక, ఛాయాగ్రాహకులలో బాలుమహేంద్ర ఒకరని కమలహాసన్ కీర్తించారు. నటి అర్చన మాట్లాడుతూ ‘‘సినిమా హీరోలకు ప్రేక్షకులు క్లాప్స్ కొడతారు. పాటలు బాగుంటే చప్పట్లు కొడతారు. కెమెరా వర్క్‌కు చప్పట్లు కొట్టించుకున్న ఏకైక ఛాయాగ్రాహకుడు బాలుమహేంద్ర. ఆయన దర్శకత్వంలో నేను నటించిన తొలిచిత్రం ‘నిరీక్షణ’. ఈ చిత్రం ఎంతలా ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిందే’’ అన్నారు. బాలుమహేంద్ర దర్శకత్వంలో ‘నిరీక్షణ’ చేయడం తనకు చాలా గర్వకారణమని భానుచందర్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement