Balu Mahendra
-
నటి మోనిక సహాయకురాలు బ్లేడుతో కోసుకుని..
పెరంబూరు: ప్రేమించిన వాడు పెళ్లికి నిరాకరించడంతో సినీ నటి సహయకురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెకు ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక విరుగంబాక్కంలో దివంగత సినీ దర్శకుడు బాలుమహేంద్ర ఇల్లు ఉంది. ఆయన భార్య, నటి మోనిక నివసిస్తున్నారు. ఆమె వద్ద సిగాలంకారిణిగా జ్యోతిక(22) పనిచేస్తోంది. ఈమె నటి మోనిక కారు డ్రవర్ కార్తీక్‌ని ప్రేమించింది. గత నెలలో కారు డ్రైవర్ అక్కడ పనిమానేశాడు. ఆ తర్వాత అతని ప్రవర్తనలో మార్పును గమనించిన జ్యోతిక తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి కార్తీక్ నిరాకరించాడు. మంగళవారం రాత్రి జ్యోతిక బ్లేడుతో చేతిని, మెడను కోసుకుని ఆత్మహత్మాయత్నానికి పాల్పడింది. ఆక్కడ ఉన్నవారు ఆమెను వెంటనే స్థానిక సాలి గ్రామంలోని ఒక ప్రైవేట్ అస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం వైద్యులు జ్యోతికకు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన విరుగంబాక్కంలో కలకలం రేపింది. -
వెండితెరపై వెలగాలని ఉంది
కొవ్వూరు రూరల్ : వెండితెరపై గుర్తింపు పొంది, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించాలని ఆశగా ఉందని టీవీ, సినీనటుడు బాలు మహేంద్ర అన్నారు. సత్యసింహా సీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న చిత్రంలో నటించడానికి పాలకొల్లుకు వచ్చిన ఆయన బుధవారం ‘సాక్షి’తో ముచ్చటించారు. నటనలో రజనీకాంత్, చిరంజీవి తనకు ఆదర్శమని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని వల్లూరు తన పుట్టిన ఊరని తెలిపారు. తండ్రి సూర్యనారాయణ వ్యవసాయం చేస్తారన్నారు. జెమిని, ఈటీవీ, దూరదర్శన్ చానెళ్లలోని దేవత, కుంకుమరేఖ, వివాహబంధం, శ్రావణి సుబ్రహ్మణ్యం, అభిషేకం సీరియల్స్‌లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు లభించిందన్నారు. సినిమాల్లో విలక్షణ నటుడిగా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నానని, గొడవ, లవకుశ, లక్ష్మి రావే మా ఇంటికి, చిత్రాల్లో నటించా నని, తెలుగు, తమిళంలో రిలీజ్ కానున్న ఓ చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. -
బాలూ మహేంద్ర ఇకలేరు!
-
దర్శక, ఛాయాగ్రాహకుడు బాలూ మహేంద్ర ఇకలేరు!
సుప్రసిద్ధ దర్శకుడు, ఛాయాగ్రాహకుడు బాలూ మహేంద్ర గురువారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్ను మూశారు. ఛాయాగ్రాహకునిగా, దర్శకునిగా ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. శ్రీలంకలో పుట్టిన బాలూ మహేంద్రకు మొదటి నుంచీ సినిమాలంటే ఆసక్తి. ‘పని ముడక్కు’ అనే మలయాళ చిత్రంతో ఛాయాగ్రాహకునిగా ఆయన ప్రస్థానం మొదలైంది. చాలా తక్కువ చిత్రాలకు మాత్రమే ఆయన పని చేశారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 27 చిత్రాలకు ఆయన ఛాయాగ్రహణం సమకూర్చారు. వాటిని దృశ్యకావ్యాలుగా తీర్చిదిద్దడంలో ఆయన ప్రజ్ఞ అపారం. తెలుగులో ‘లంబాడోళ్ల రాందాసు’, మనవూరి పాండవులు, శంకరాభరణం, కలియుగ రావణాసురుడు, సొమ్మొకడిది సోకొకడిది తదితర చిత్రాలకు తన కెమెరాతో వన్నెలద్దారు. ‘కోకిల’ అనే కన్నడ చిత్రంతో దర్శకునిగా అవతారం ఎత్తారు. ఆ సినిమా ద్వారా ఉత్తమ ఛాయాగ్రాహకునిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. తను డెరైక్ట్ చేసిన సినిమాలకు దాదాపుగా తనే ఛాయాగ్రహణం చేసుకున్నారు. కమలహాసన్, శ్రీదేవితో తమిళంలో తీసిన ‘మూండ్రాం పిరై’ ఆయనకు దర్శకునిగా ఎనలేని కీర్తి ప్రతిష్టలను ఆర్జించి పెట్టింది. కమలహాసన్‌కు ఉత్తమ నటునిగానూ, బాలూమహేంద్రకు ఉత్తమ ఛాయాగ్రాహకునిగానూ ఈ సినిమా ద్వారా జాతీయపురస్కారాలు లభించాయి. శ్రీదేవి తన కెరీర్లో టాప్ టెన్ సినిమాల్లో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. ఈ చిత్రాన్నే తెలుగులో ‘వసంత కోకిల’గా అనువదించారు. దీన్నే హిందీలో ‘సద్మా’గా రీమేక్ చేసి, బాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకున్నారు. తెలుగులో బాలూ మహేంద్ర డెరైక్ట్ చేసిన ఏకైక చిత్రం ‘నిరీక్షణ’. భానుచందర్, అర్చన నటించారు. ఆయన తమిళంలో దర్శకత్వం చేసిన ‘వీడు’ చిత్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ సినిమా ద్వారా అర్చనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది. బాలూ మహేంద్ర మొత్తం 22 చిత్రాలకు దర్శకత్వం చేశారు. ఆయనకు భార్య అఖిల, కొడుకు సంగీ మహేంద్ర ఉన్నారు. ఆయన మృతికి యావత్ దక్షిణాది చిత్రపరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. బాలూ మహేంద్ర భౌతికకాయానికి శుక్రవారం ఉదయం చెన్నైలో అంత్యక్రియలు జరుగనున్నాయి. సినీ ప్రముఖుల నివాళి: తమిళ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శక, ఛాయాగ్రాహకులలో బాలుమహేంద్ర ఒకరని కమలహాసన్ కీర్తించారు. నటి అర్చన మాట్లాడుతూ ‘‘సినిమా హీరోలకు ప్రేక్షకులు క్లాప్స్ కొడతారు. పాటలు బాగుంటే చప్పట్లు కొడతారు. కెమెరా వర్క్‌కు చప్పట్లు కొట్టించుకున్న ఏకైక ఛాయాగ్రాహకుడు బాలుమహేంద్ర. ఆయన దర్శకత్వంలో నేను నటించిన తొలిచిత్రం ‘నిరీక్షణ’. ఈ చిత్రం ఎంతలా ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిందే’’ అన్నారు. బాలుమహేంద్ర దర్శకత్వంలో ‘నిరీక్షణ’ చేయడం తనకు చాలా గర్వకారణమని భానుచందర్ పేర్కొన్నారు.