హిమాలయన్‌ వయాగ్రా..‘యార్సాగుంబా.. | viagra in himalaya | Sakshi
Sakshi News home page

హిమాలయన్‌ వయాగ్రా..‘యార్సాగుంబా..

Published Wed, Jun 7 2017 12:34 AM | Last Updated on Sat, Oct 20 2018 6:40 PM

హిమాలయన్‌ వయాగ్రా..‘యార్సాగుంబా.. - Sakshi

హిమాలయన్‌ వయాగ్రా..‘యార్సాగుంబా..

ఒక కిలో యార్సాగుంబా ధర రూ.60 లక్షల(లక్ష డాలర్ల) పైమాటే. గ్రామీణ నేపాల్‌లో ఉపాధి అవకాశాలు తక్కువ కావడంతో మెజారిటీ కుటుంబాలు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. చాలా విలువైన మూలికలు కావడంతో వీటి కోసం ప్రాణాలకు తెగించి మరీ ఈ కుటుంబాలు పోరాడుతున్నాయి.

హిమాలయాల్లో వేసవి ప్రారంభమై మంచు కరగడం మొదలుపెడితే చాలు.. నేపాలీలు పచ్చిక బయళ్ల వైపు పరుగు తీస్తారు.. నెల రోజుల పాటు బంగారం కన్నా విలువైన వస్తువు కోసం చిన్నాపెద్దా అంతా వేట సాగిస్తారు. ఇంతకీ వీరి అన్వేషణ దేనికి అంటే.. యార్సాగుంబా కోసం.. ఇదే హిమాలయన్‌ వయాగ్రా. పసుపు పచ్చ రంగులో ఉండే యార్సాగుంబా బురదలో పెరుగుతుంది. లైంగిక కోరికలను రేకెత్తించడం తోపాటు పుష్కలమైన ఔషధ గుణాలున్న మూలిక.

గొంగళిపురుగు లాంటి ఓ పురుగు లార్వా తలపై పుట్టగొడుగుల మాదిరిగా పెరిగే ఫంగస్సే ఈ యార్సాగుంబా. చైనాలో డాంగ్‌ ఛాంగ్‌ జియా కావో అనే రెండు తలల పురుగు ఉంటుంది. దీనిని వేసవి గడ్డి, చలికాలపు పురుగు అంటారు. శీతాకాలంలో యార్సాగుంబా పురుగులా ఉంటే.. వేసవి వచ్చేసరికి ఫంగస్‌ కారణంగా చిన్న మొక్క మాదిరిగా మారిపోతుంది. పూర్తిగా తయారైన యార్సాగుంబా ఒక అగ్గిపుల్ల మాదిరిగా.. రెండు నుంచి మూడు సెంటీమీటర్ల పొడుగు ఉంటుంది.

ఎలా గుర్తించారు...
వెయ్యేళ్ల క్రితం పశుపోషకులు యార్సాగుంబాను గుర్తించారు. దీనిని పశువులకు దాణాగా ఉపయోగించే వారు. వీటిని తిన్న తర్వాత పశువులు చాలా చురుకుగా మారిపోయేవి. దీంతో ఈ మూలికల్లో ప్రత్యేకత ఉందని గుర్తించారు. 1960ల్లో టీ, సూప్‌లు మొదలైన వాటిలో ఈ మూలికలను కలిపి తాగేవారు. బాతులను తినేందుకుగానూ ముందుగా వాటికి యార్సాగుంబా మూలికలను తినిపించేవారు. ఓ చైనీస్‌ రన్నర్‌ దీనిని తిని రెండు ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టడంతో 1990ల్లో దీనికి ప్రపంచ గుర్తింపు లభించింది.

పెరిగిన డిమాండ్‌.. తగ్గిపోతున్న ఉత్పత్తి..
ప్రస్తుతం చైనా ఔషధ పరిశోధకులు దీనిని లైంగిక కోరికలు పెంచే.. నపుంసకత్వాన్ని నయం చేసే మూలి కగానే కాక.. జాయింట్‌ పెయిన్స్‌ను తగ్గిస్తుందని, ఊబకా యం, కేన్సర్‌కు ఉపయోగపడుతుందని చెపుతున్నారు. యార్సాగుంబాకు ఉన్న వైద్య విలువపై హైప్‌ కారణంగా ఇటీవల డిమాండ్‌ పెరిగింది. ఈ ఉత్పత్తుల కోసం జనం ఎగబడుతున్నారు. దీంతో 2009–2011 తర్వాత యార్సాగుంబా ఉత్పత్తి సగానికిపైగా పడిపోయింది. సరైన నియంత్రణ లేకపోవడం, వాతావరణ మార్పులు, ఉత్పత్తికి మించి డిమాండే దీనికి కారణం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement