తన చితికి తానే నిప్పంటించుకుని...
అప్పుల బాధ భరించలేక తన చితికి తానే నిప్పంటించుకుని ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని భాంభ్ గ్రామంలో జరిగింది. ఆనంద్‌రావు ఎస్.పండాగ్లే (45) అనే రైతుకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారని విదర్భా జన్ ఆందోళన్ సమితీ చీఫ్ కిషోర్ తివారీ తెలిపారు. పండాగ్లేకు రూ. 50 వేల అప్పు అప్పటికే ఉండగా, తన పెద్ద కూతురు పెళ్లి కోసం రూ. 12 వేల అప్పు కోసం ప్రయత్నించాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఎంత ప్రయత్నించినా అప్పు దొరకలేదు.
ఇంట్లో ఒక్కడే ఉన్న సమయంలో తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని, చితి పేర్చుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు కాపాడడానికి వచ్చినా ఆయన అప్పటికే కాలిపోయి మృతిచెందాడని తివారీ తెలిపారు. ఈ తరహా ఘటన జరగడం ఇది రెండోసారి. గత నవంబర్ 28న మనర్‌ఖేడ్ గ్రామానికి చెందిన కాశ్మీరాం బి.ఇందార్(75) కూడా ఇలాగే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత బుధవారం నుంచి విదర్భలో ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు.