
ఆ వ్యక్తి.. కొండచిలువ కడుపులో దొరికాడు!
ఇండోనేషియాలో అదృశ్యమైన ఓ రైతు.. ఓ భారీ కొండచిలువ కడుపులో దొరికాడు. తన వ్యవసాయ పొలంలో పనిచేసుకుంటుండగా ఆ వ్యక్తి అదృశ్యమయ్యాడు. అక్కడ సమీపంలోనే భారీగా ఉబ్బిన కడుపుతో ఓ కొండచిలువ కనిపించింది. అనుమానం వచ్చిన స్థానికులు కొండచిలువను చంపి.. దాని కడుపును చీల్చి చూడగా.. అందులో అదృశ్యమైన రైతు మృతదేహం లభించింది. ఇండోనేషియా తూర్పు సులావేసి దీవులలోని సలుబిరో గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
25 ఏళ్ల రైతు అయిన అక్బర్ ఆదివారం తన పండ్లతోటలో పనిచేస్తూ అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. అతను ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతుకులాట ప్రారంభించారు. ఇంతలో పండ్లతోట సమీపంలో ఓ 25 అడుగుల కొండచిలువ భారీగా ఉబ్బిన కడుపుతో కనిపించిందని, దాని మీద అనుమానంతో దాడి చేయగా.. అసలు విషయం తేలిందని స్థానికుడు జునైద్ తెలిపారు. కొండచిలువ మనిషి చంపి..పూర్తిగా మింగిన ఘటన జరగడం తమ ప్రాంతంలో ఇదే తొలిసారి అని చెప్పారు.