
పల్లె పొమ్మంది!
పొట్టచేతబట్టుకొని పట్నం బాట పడుతున్న పల్లెవాసులు
► ఉన్న ఊళ్లో పనులు కరువై వలస వెళ్తున్న జనం
► అడ్డాపై కూలీలుగా రైతుల దైన్యం
► రెండేళ్ల నుంచి వర్షాల్లేక చతికిలపడిన వ్యవసాయం
► జిల్లా కేంద్రాలు, హైదరాబాద్, ముంబై నగరాలకు పెరుగుతున్న వలసలు... అక్కడా పనులు దొరక్క అవస్థలు
► అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు పయనమవుతున్న యువత
పది మంది కూలీలతో నాలుగెకరాల సొంత భూమిలో పనులు చేయించు కుంటూ ఊళ్లో గౌరవంగా బతికిన ఓ రైతు ఇప్పుడు తానే కూలీగా మారిపో యాడు! ఆత్మాభిమానాన్ని చంపుకొని అడ్డాపై నిలబడి కూలికోసం దీనంగా ఎదురుచూస్తున్నాడు!!
కాలే కడుపుకు ఇన్నాళ్లూ నాలుగు ముద్దలందించిన ఉపాధి పని కరువవడంతో భార్యాపిల్లల్ని వదిలేసి బతుకు బండిని లాగేందుకు బొంబాయి బస్సెక్కాడు
ఓ భర్త!!
ఉన్న ఊళ్లో పనిలేక పొట్ట చేతబట్టుకొని ఎడారి దేశానికి పయనమైన చెట్టంత కొడుకును చూస్తూ కళ్లలో నీళ్లు నింపుకున్నారు
ఓ ముదుసలి
తల్లిదండ్రులు!!!
సాక్షి నెట్‌వర్క్
...తెలంగాణ పల్లె మళ్లీ వలసబాట పట్టింది. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో పల్లెలు అల్లాడుతున్నాయి. ఉపాధి కరువై పొట్ట చేతబట్టుకొని పట్టణాలు, నగరాలకు జనం వలస వెళ్తున్నారు. అక్కడ కూడా పని దొరకకుంటే పక్క రాష్ట్రాలకు పయనమవుతున్నారు. యువకులు, మధ్య వయసువారు వలసలు వెళ్లడంతో చాలా గ్రామాలు, తండాల్లోమహిళలు, పిల్లలు, వృద్ధులే కనిపిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న వారిలో కొందరు పిల్లల్ని కూడా వెంట తీసుకువెళ్తుండడంతో వారి చదువు మధ్యలోనే ఆగిపోతోంది. వరుసగా రెండేళ్లపాటు వర్షాల్లేక సాగు చతికిల పడడం, కాస్తోకూస్తో పొట్ట నింపుతున్న ఉపాధి పనులు అరకొరగా సాగుతుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ వలసలు కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి ఎక్కువగా మహారాష్ట్రలోని నగరాలకు వెళ్తున్నారు. పల్లెల నుంచి జిల్లా కేంద్రాలు, హైదరాబాద్‌కు వలస వెళ్తున్నవారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడ కూడా పనులు అంతంతే దొరకడంతో పస్తులు తప్పడం లేదు.
బతుకుదెరువు కోసం పట్నంబాట..
ఆదిలాబాద్ జిల్లా సిర్పూరు(యు), జైనూరు, కెరిమెరి మండలాల్లో కుటుంబాలకు కుటుంబాలే ముంబై, హైదరాబాద్ నగరాలకు వలస వెళ్తున్నాయి. అక్కడ నిర్మాణ రంగంలో కూలీ పనులకు వెళ్తూ పొట్టబోసుకుంటున్నారు. ఒకప్పుడు రైతులుగా ఇతరులకు పని కల్పించిన వారే ఇప్పుడు కూలీలుగా మారుతున్నారు. జిల్లాలోని బెజ్జూరు. కౌటాల, దహెగాం, కాగజ్‌నగర్ మండలాల ప్రజలు మిరప పంట ఏరేందుకు ఖమ్మం జిల్లాకు వలసలు వెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల నుంచి ఎక్కువగా గిరిజనులు ముంబై వెళ్తున్నారు. పరిగి నియోజకవర్గం కుల్కచర్ల నుంచి ముంబైకి ప్రతీరోజు ఏకంగా ఒక బస్సు నడుపుతున్నారంటే పరిస్థితిని ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎనిమిది నెలలపాటు వారు ముంబైలోనే కూలీలుగా పనిచేస్తూ.. ఇంటికి కొంత మొత్తాన్ని పంపిస్తున్నారు. కరువు దెబ్బకు పాడి కూడా కుదేలైంది. దుర్భిక్ష పరిస్థితుల కారణంగా రైతులు పశువులను కూడా తెగనమ్ముకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో చాలామంది రైతులు అడ్డాకూలీలుగా మారారు. కూలీ కోసం రోజూ కరీంనగర్ జిల్లా కేంద్రానికి వస్తున్నా.. వారిలో అందరికి పని దొరకడం లేదు. పనిలేని రోజు బస్సు చార్జీలు అదనంగా నెత్తినపడుతున్నాయి. కరీంనగర్ నగరంలో గతంలో కూలీల అడ్డాపై 1,500 మంది ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 2,500కి పెరిగిపోయింది. దీనితో కూలీకి కూడా తీవ్ర పోటీ తప్పడం లేదు. 2,500 మంది కూలీల్లో ఐదారు వందల మంది కూలీ దొరక్క నిరాశతో వెనక్కి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
పాలమూరులో 20 వేల కుటుంబాలు..
మహబూబ్‌నగర్ జిల్లాలో కూలీలు వలసబాట పడుతున్నారు. జిల్లాలో దాదాపు 20వేలకు పైగా కుటుంబాలు వలసలపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. నారాయణపేట డివిజన్‌లోని నారాయణపేట, కొడంగల్, వనపర్తి నియోజకవర్గాల్లోని కూలీలు ముంబై, పూణె, షోలాపూర్, హైదరాబాద్ తదితర నగరాలకు వలసలు వెళ్తున్నారు. ఊళ్లోనే వ్యవసాయం చేసుకుంటున్నవారు కాలం కలిసిరాక అప్పులపాలవుతున్నారు.
మెతుకుసీమలో బతుకు కరువు
మెతుకుసీమగా పేరొందిన మెదక్ జిల్లాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. జహీరాబాద్, నారాయణ్ ఖేడ్, దుబ్బాక, ఆందోల్, సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్ నుంచి కూడా పెద్దసంఖ్యలో వలస వెళ్తున్నారు. కరువుతో సాగుకే కాదు తాగునీటికీ కష్టంగా మారింది. అటు గ్రాసం, ఇటు నీళ్లు దొరక్క పశువులు సైతం విలవిల్లాడుతున్నాయి.
అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు..
యువకులు గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు అందిన కాడికి అప్పులు చేస్తూ.. ఏజెంట్ల చుట్టూ తిరుగుతున్నారు. గ ల్ఫ్‌లో పని చే యడానికి అవసరమైన వీసాలు లేకుండా కేవలం విజిటింగ్ వీసాపైనే ఏజెంట్లు వారిని అక్కడకు పంపించి చేతులు దులుపుకొంటున్నారు. ఇలాంటి మోసాలు కోకొల్లలుగా బయటపడుతున్నా... అమాయక ప్రజలు వారినే నమ్ముకొని నిండా మునుగుతున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, వేములవాడ, చందుర్తి, కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాల నుంచి గల్ఫ్‌కు వలసలు పెరిగాయి.
ఊళ్లకు ఊళ్లే ఖాళీ..
నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో 60 శాతం ఊళ్లు దాదాపు ఖాళీ అయ్యాయి. పోలేపల్లి, దాసర్లపల్లి, ముర్పునూతల, తెల్దేవర్‌పల్లి, పలుగుతండా వెంకటనాయక్ తండాల్లోని ప్రజలు వలసల బాటపట్టారు. చాలా ఇళ్లకు తాళాలే కనిపిస్తున్నాయి. చందంపేట మండలం నుంచి గుంటూరు జిల్లా గురజాల, కారంపూడి, చిలుకలూరిపేటకు మిర్చి కోసేందుకు వెళ్లారు. మరికొందరు హైదరాబాద్‌లో ఆటో రిక్షా నడుపుకునేందుకు వెళ్లగా.. ఇంకొందరు ఫ్రూట్ మార్కెట్‌లో హమాలీలుగా పనుల కోసం వెళ్లారు. దేవరకొండ, ఆలేరు, మిర్యాలగూడ, తుంగతుర్తి, మునుగోడు నియోజకవర్గాల్లో ఎక్కువగా వలసలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్, జుక్కల్, మద్నూరు, గాంధారి, తాడ్వాయి మండలాల నుంచి మహారాష్ట్ర, హైదరాబాద్‌లకు రైతులు, కూలీలు వలస వెళ్తున్నారు. మహారాష్ట్రకు వెళ్తున్నవారు అక్కడ భూస్వాముల పొలాల వద్ద పంటల కాపలాదారులుగా పని చేస్తున్నారు.
గోసగోస అయితంది..
మాకు రెండెకరాల భూమి ఉంది. నీళ్లు లేక బీడు పడింది. ఊళ్లె కైకిలి(కూలీ) పని కూడా దొరుకుత లేదు. ఉపాధి పని కూడా నడుస్తులేదు. గోసగోస అయితంది. పిలగాండ్ల చదువుకు, తిండికి తిప్పలైతంది. కరీంనగర్‌కు కూలీ పనికి వస్తున్న. నాలాంటోళ్లు చానా మంది వస్తున్నరు. మంది బాగా అయ్యేసరికి ఇక్కడ కూడా పని సరిగా దొరుకుతలేదు.
- బానోతు తస్లీ, మల్చేరుతండా, హుస్నాబాద్ మండలం, కరీంనగర్
కూలీగా మారిన రైతు
నాకున్న రెండెకరాలతోపాటు మరో రెండెకరాలు కౌలుకు చేసేటోన్ని. మూడేండ్ల నుంచి వానలు లేవు. బావిలో నీళ్లు పడలేదు. నాలుగు గజాల బండ కొట్టిచ్చిన. అయినా చుక్క నీళ్లు రాలే. లక్ష రూపాయలు ఖర్చయింది. పంట పండే పరిస్థితి లేదు. భార్యాపిల్లలను ఊళ్లో వదిలి కరీంనగర్‌లో కూలీ కోసం వచ్చి ఉంటున్న. నెలకు 20 రోజుల పని కూడా దొరుకుతలేదు.
- పింకాసి బాలయ్య, వంతడుపుల, ఇల్లంతకుంట మండలం, కరీంనగర్
కొడుకులు పట్నం పోయిండ్రు
ఎవసాయం ఎండి పోయింది. బోర్లు వట్టిపోయాయి. ఊర్లో ఉపాధి లేక నా కొడుకు భార్యాపిల్లల్ని వదిలి పట్నం పోరుుండు. ముసలి తనంలో తోడుగా ఉంటాడనుకుంటే కాలం పగబట్టింది.
- కొయ్యడ ఆగయ్య, రామచంద్రాపూర్, బచ్చన్నపేట మండలం, వరంగల్
అప్పు తెగేదెప్పుడు..? ఇంటికి వచ్చేదెప్పుడు?
ఈ కూలీ దంపతుల పేరు ఎదునూరి దేవయ్య, కనుకవ్వ. ఊరు కరీంనగర్ జిల్లా ముస్తాబాద్. వీరికి రెండెకరాల భూమి ఉంది. వర్షాల్లేక బావి ఎండిపోయింది. పిల్లలు అనూష, ప్రశాంత్ చదువులు, కుటుంబ పోషణకు రూ.4 లక్షల అప్పు చేయాల్సి వచ్చింది. భార్యాభర్తలిద్దరూ రెండు నెలలుగా ఉపాధి పనులకు వెళ్తున్నారు. రోజుకు రూ.120 వస్తోంది. ఇది ఏ మూలకు సరిపోవడం లేదు. కుటుంబం గడిచేందుకు మస్కటే శరణ్యమనుకున్నాడు. రూ.70 వేలు అప్పు చేసి ఏజెంట్ చేతిలో పెట్టాడు. అక్కడ ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో కూలీ పనికోసం వీసా వచ్చింది. ఈ నెల 13న మస్కట్‌కు వెళ్లేందుకు విమానం ఎక్కబోతున్నాడు. అక్కడ రూ.15 వేలు జీతం వస్తుందని, రూ.5 వేలు తిండికి, ఉండడానికి సరిపోయినా.. నెలకు రూ.10 వేలు పంపిస్తే భార్యాపిల్లలు బతుకుతారని దీనంగా చెబుతున్నాడు. రూ.4 లక్షల అప్పు తీర్చడానికి ఎన్నేళ్లు పడుతుందో.. కాలమే సమాధానం చెప్పాలి!
ఉపాధి కూలీకి పైసలేవీ?
ఉపాధి హామీ పనులు ఆశించిన మేరకు సాగడం లేదు. రెండునెలలుగా పనిచేసినా కూలీలకు వేతనాలు అందడం లేదు. దీంతో చాలామంది కూలీలు పనికి వెళ్లడం మానేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకానికి రూ.500 కోట్లు విడుదల చేసినా రాష్ట్ర సర్కారు రూ.100 కోట్లే విడుదల చేసింది. మిగతా రూ.400 కోట్లు ఇతర అవసరాలకు వినియోగించింది. దీంతో కూలీలకు సకాలంలో కూలీ డబ్బులు అందడం లేదు.