
'కేజ్రివాల్, ఆమ్ ఆద్మీపార్టీతో విబేధాలు లేవు'
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో ఎలాంటి విభేదాలు లేవని ఆపార్టీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్ని మీడియాకు వెల్లడించారు. తనను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంపై ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. కేబినెట్ జాబితా నుంచి తప్పించడాన్ని తాను అంతగా సీరియస్ గా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వ ఏర్పాటుకు ముందు లెఫ్టినెంట్ గవర్నర్ కు సమర్పించిన జాబితానుంచి తనను తొలగించాలని తానే కోరానని బిన్నీ తెలిపారు.
ఎన్నికల్లో ఇచ్చిన వాగ్గానాల్ని అమలు చేయడంలో ఆమ్ ఆద్మీ పార్టీ విఫలమవుతోంది అని ఓ ఇంటర్వ్యూలో బిన్ని తెలిపడంతో కేజ్రివాల్ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం మంగళవారం జరిగింది. అయితే పార్టీ సమావేశంలో సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తకుండా..మీడియాలో పార్టీ నియమాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని కేజ్రివాల్ తప్పుపట్టారు.