హైదరాబాద్: సర్ధార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే హైదరాబాద్ కు వీసా తీసుకోవాల్సి వచ్చేదని గుజరాత్ న్యాయశాఖా మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా తెలిపారు. పటేల్ విగ్రహానికి, బీజేపీకి సంబంధముందన్న ఊహాగానాలపై ఆయన స్పందించారు. సర్ధార్ పటేల్ విగ్రహానికి, బీజేపీకి సంబంధం లేదని జడేజా తెలిపారు. పటేల్ విగ్రహ ప్రతిష్టాపన ట్రస్టు ద్వారా జరుగుతోందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి రైతూ ఇందులో భాగస్వామ్యం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్‌లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందు కోసం దేశంలోని ప్రతీ గ్రామం నుండి పాత ఇనుమును సేకరించనున్నారు. దేశ ప్రజలను ఐక్యతగా ఉంచడానికి స్టాట్యూ ఆఫ్ యూనిటీని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక చిహ్నంగా నిర్మిస్తామని, ఆ విగ్రహం న్యూయార్క్ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే పెద్దగా ఉంటుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.