ఐపీఎల్కు కొత్త స్పాన్సర్
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి పెప్సీ తప్పుకుంది. పెప్సీ స్థానంలో చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ 'వివో' ముందుకొచ్చింది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా పెప్సీ 2013లో ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 396 కోట్ల భారీ మొత్తానికి కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం 5 సంవత్సరాలు టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించాల్సి ఉంది. కానీ ఇటీవల ఐపీఎల్లో వెలుగుచూసిన స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంతో పెప్సీ ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. పెప్సీ కన్నా ముందుగా ఐపీఎల్కు డీఎల్ఎఫ్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించింది. 200 కోట్లకు కుదిరిన డీఎల్ఎఫ్ ఒప్పందం 2008 నుంచి 2012 వరకు కొనసాగింది.
ఈ విషయంపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. పెప్పీ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకోవడం చాలా చిన్న విషయం అన్నారు. ఈ ఘటన ఐపీఎల్ పై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు. పెప్సీతో తమ అనుబంధం చక్కగా కొనసాగిందని, సామరస్య పూర్వకమైన చర్చలతో ఈ వ్యవహారం ముగుస్తుందని ప్రకటించారు. రెండు సంవత్సరాలకు టైటిల్ స్పాన్సర్గా ఇప్పటికే చైనా కంపెనీ వివోతో ఐపీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. పెప్సీ ఒప్పందానికి వర్తించిన నియమనిబంధనలే ఈ డీల్ కు కూడా వర్తిస్తాయని ప్రకటించింది.
2013లో వెలుగుచూసిన అంకిత్ చవాన్, శ్రీశాంత్, చండీలాల స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంతో ఐపీఎల్ ప్రతిష్ఠ మసకబారింది. తాజాగా స్పాట్ ఫిక్సింగ్పై జస్టిస్ లోథా కమిటి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్లు నిషేధం విధించడంతో పెప్సీ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.