అత్యవసర ద్వారాలు ఉండవు.. ఎమర్జెన్సీ విండో గ్లాసులుంటాయి
ప్రమాదం జరిగిన బస్సులో వాటిని పగలగొట్టే హ్యామర్లు లేవు
విదేశాల్లోని రోడ్లకే కానీ మన రహదారులకు సరిపోవు
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక హంగులతో, సకల సదుపాయాలతో, అపరిమిత వేగంతో దూసుకుపోయే వోల్వో బస్సుల్లో ప్రయాణం ఎంత విలాసవంతమో అంత ప్రమాదకరమని బుధవారం నాటి ఘటనతో తేలిపోయింది. సాధారణంగా అన్ని బస్సుల్లో అత్యవసర ద్వారాలు(ఎమర్జెన్సీ డోర్స్) ఉంటాయి. కానీ బుధవారం దగ్ధమైన వోల్వో బస్సులో ఈ అత్యవసర ద్వారాలు లేవు. కానీ, ప్రమాద సమయంలో బయటపడేందుకు వీలుగా నాలుగు ఎమర్జెన్సీ విండో గ్లాస్‌లు మాత్రం ఉన్నాయి. మంటలను అదుపు చేసేందుకు వాహనంలో సహాయకుడి సీట్ వద్ద ఒకటి, వెనకభాగంలో ఒకటి.. రెండు ఫైర్‌సేప్టీ కిట్‌లు కూడా ఉంటాయి. ఎమర్జెన్సీ విండోలు సీట్ల వరుసలో 5,6,7,8 సీట్ల వద్ద , 33,34,35,36 సీట్ల వద్ద రెండు వైపులా ఉంటాయి.
వీటిని తేలిగ్గా పగులగొట్టవచ్చు. ఇవి సింగిల్ గ్లాస్‌తో గ్యాస్ నింపి తయారు చేస్తారు. అయితే, ఈ విషయం సామాన్యంగా ప్రయాణికులకు ఎవరికీ తెలియదు. బస్సు బయలుదేరే ముందు డ్రైవర్ ఆ విషయం ప్రయాణికులకు వివరించాలి. అయితే, వాటిని పగులగొట్టేందుకు అవసరమైన హ్యామర్లు మాత్రం ఆ బస్సులో లేవు. అంతేకాదు ప్రమాద సమయాల్లో ఎలా వ్యవహరించాలి, సేఫ్టీ కిట్‌లను ఎలా ఉపయోగించాలన్న విషయాలను డ్రైవర్ బస్సు స్టార్ట్ చేసేముందు ప్రయాణీకులకు వివరించాలి. డ్రైవర్ అదీ చేయలేదు. దాంతో ప్రయాణీకులకు కనీసం గాయాలతో అయినా బయటపడే అవకాశం లభించలేదు.
ప్రమాదానికి ఇలా అవకాశం...
వోల్వో బస్సులకు డ్రైవర్‌సీట్ కిందిభాగంలో రెండు బ్యాటరీలు ఉంటాయి. వీటి నుంచే ఎ/సి, టీవి, స్పీకర్స్, లైట్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. రోడ్డుపైన స్పీడ్‌బ్రేకర్లు, గుంతలు, ఎత్తై కల్వర్టులు వంటివి వచ్చినప్పుడు బస్సు ముందుభాగం భూమిని తాకుతుంది. ఆ సమయంలో బ్యాటరీలు రెండూ రాపిడికి గురై మంటలు వచ్చే అవకాశం ఉంది. బ్యాటరీల్లో వచ్చిన మంటలు విద్యుత్ వైర్ల ద్వారా బస్సు మొత్తం త్వరగా వ్యాపించేందుకు అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పైగా బ్యాటరీలకు పక్కనే కొద్దిగా పైన డిజీల్ ట్యాంక్ ఉంటుంది. బుధవారం నాటి ప్రమాదంలో మొదట బ్యాటరీల్లో మంటలు అంటుకొని అవి ఆయిల్‌ట్యాంకర్‌కు వ్యాపించి ఉండవచ్చునని, దాంతో బస్సు మొత్తం క్షణాల్లో బూడిదైందని వారు భావిస్తున్నారు. అంతేకాకుండా, విదేశీ రహదారులు, అక్కడి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన వోల్వో బస్సులు మన రహదారులకు అనుకూలం కాదనే అభిప్రాయం కూడా ఉంది.
రాష్ట్రంలో దాదాపు 500 వోల్వో బస్సులు
హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు తిరుగుతున్న వోల్వో బస్సుల సంఖ్య దాదాపు 500 ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో 109 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. వాటిలో డబుల్ యాక్సిల్(గరుడ ప్లస్) బస్సులు 21 ఉండగా, 80 బస్సులు సింగిల్ యాక్సిల్(గరుడ) బస్సులు ఉన్నాయి. మరో 8 బస్సులను సిటీ శీతల్ పేరిట హైదరాబాద్‌లో తిప్పుతోంది. అవి కాకుండా మరో 400 వోల్వో బస్సులను ప్రైవేటు ఆపరేటర్లు తిప్పుతున్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు బెంగుళూరు, చెన్నై, షిర్దీ, ముంబై తదితర ప్రాంతాలకు వీటిని నడుపుతున్నారు.