'వరంగల్ ఎంపీ టికెట్టు మాకే ఇవ్వాలి'
వరంగల్: వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరిగే ఉప ఉన్నికలో ఏ రాజకీయ పార్టీ అయినా మాదిగలకే టికెట్ ఇవ్వాలని ఎమ్మెస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ మాదిగలకు టికెట్ ఇవ్వకుండా కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్‌ఎఫ్ దీక్షా శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ ఎంపీ టికెట్‌ను మాదిగలకే ఇస్తామని గతంలో ప్రకటించిన మంత్రి కడియం శ్రీహరి.. ఇప్పుడు తన కూతురును బరిలో నిలపాలని యోచించడం వెనుక ఆంత్యర్యమేంటని ప్రశ్నించారు.
మాదిగల సహకారంతోనే కడియం రాజకీయంగా నిలదొక్కుకున్నారనేది గమనించాలన్నారు. మోసం చేయాలని చూస్తే శ్రీహరిని మాదిగలు శత్రువుగా పరిగణిస్తారన్నారు. తెలంగాణ పలెల్లో కడియం శ్రీహరి తిరగకుండా అడ్డుకుంటామన్నారు. తక్కువ శాతం ఉన్న మాలలకు ఎంపీ టికెట్ కట్టబెట్టి మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. సంక్షేమ రంగాల్లో వర్గీకరణ ప్రకటించే విషయంపై కడియం శ్రీహరి తక్షణమే సమాధానం చెప్పాలన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతకు పార్లమెంట్‌లో బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.