
ఉద్యమంలా అభివృద్ధి చేసుకుందాం
‘‘గుప్పెడు మనుషులతో తెలంగాణ ఉద్యమం తుపాన్‌లా దూసుకుపోయింది. ఆ దెబ్బకే దేశ రాజకీయ వ్యవస్థ దిగివచ్చి ....
ఎర్రవల్లి, నర్సన్నపేట రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామాలు కావాలి: సీఎం కేసీఆర్
జగదేవ్‌పూర్: ‘‘గుప్పెడు మనుషులతో తెలంగాణ ఉద్యమం తుపాన్‌లా దూసుకుపోయింది. ఆ దెబ్బకే దేశ రాజకీయ వ్యవస్థ దిగివచ్చి తెలంగాణ ఇచ్చింది. అభివృద్ధి కూడా ఉద్యమంలాగే చేయాలి. అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకునేలా రెండు గ్రామాల ప్రజలు సమష్టిగా కదలాలి’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం మెదక్ జిల్లాలోని తన రెండో దత్తత గ్రామమైన నర్సన్నపేట గ్రామసభలో సీఎం మాట్లాడారు. ‘‘ఏదైనా సాధించాలంటే పట్టుదల, కృషి ఉండాలి. ఎంతో మంది ఉద్యమిస్తే తెలంగాణ సాధ్యమైంది. అలాగే అభివృద్ధి జరగాలంటే ఉద్యమం తప్పదు. ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలి. ఎర్రవల్లి, నర్సన్నపేటలను రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామాలుగా తయారుచేస్తాం. అందరినీ బతికిచ్చుకునే ఉపాయం ఉండాలి. ఒక్కరు కూడా ఉపవాసం ఉండొద్దు.
హైదరాబాద్ మాదిరి గ్రామాలను తీర్చిదిద్దుతాం. ఈ రెండు గ్రామాలను చూస్తే హైదరాబాద్ గుర్తుకు వచ్చేలా అభివృద్ధి చేస్తాం’’ అని చెప్పారు. గ్రామాలకు రెండున్నరేళ్లలో గోదావరి నీళ్లు తీసుకువస్తామన్నారు. గ్రామంలో ఇంచు భూమి కూడా ఖాళీగా ఉండొద్దని, గుంట భూమిలో కూడా పంటలను సాగు చేసుకునేలా రైతులు ముందుకు రావాలన్నారు. వ్యవసాయమే బతుకుదెరువుగా మార్చుకోవాలని సూచించారు. రైతులందరికీ పనిముట్లను అందించాలని అధికారులను ఆదేశించారు. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అభివృద్ధి కమిటీలతోపాటు అప్పు ఇచ్చే కమిటీ, వసూలు చేసే కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ‘‘దం డం పెట్టి అడుక్కునే రోజులు పోవాలి. స్వయంపాలిత రోజులు రావాలి. రెండు గ్రామాలను బంగారు తునకలుగా మార్చి దేశం మొత్తం ఇటు చూసేలా చేస్తాం’’ అని పేర్కొన్నారు. గ్రామంలో ఏయే సర్వేలు చేశారో తెలుసుకున్నారు. రాత్రి 8 గంటలకు వ్యవసాయక్షేత్రానికి వెళ్లారు. రెండ్రోజులు ఫామ్‌హౌస్‌లోనే ఉంటారని సమాచారం.