సాక్షి, యాదాద్రి: తెలంగాణ ఉద్యమకారులను తిట్టినోళ్లు, కొట్టినోళ్లు ఇప్పుడు ముఖ్యమంత్రి వద్ద ఉన్నారని టీజీవో గౌరవాధ్యక్షుడు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా గెజిటెడ్ ఆఫీసర్స్ డైరీ ఆవిష్కరణ కోసం ఆయన భువనగిరికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యోగులు, ఉద్యమకారులకు ప్రస్తుతం న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను తిట్టినోళ్లు, మమ్మల్ని కొట్టించి జైలులో పెట్టించినోళ్లదే రాజ్యం నడుస్తుంది. అలాంటి వారి వద్దకు పనుల కోసం పోవాలంటే బాధ అనిపిస్తోంది. గతాన్ని తలచుకుంటే దుఃఖం వస్తోంది’’అని పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారిలో వందశాతం ఈ బాధ ఉందని, కళ్లలోకి నీళ్లొస్తున్నాయని చెప్పా రు. ఈ విషయమై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఉన్నమాటే అన్నారని పేర్కొన్నారు.
వారిని అందుకే తీసుకున్నారేమో!
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆంధ్రా నాయకులు తెలంగాణను దెబ్బతీసే ప్రయత్నం మొదలుపెట్టారని, వాళ్ల ఆధిపత్యం చలాయించే చర్యలు ప్రారంభించారని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఈ సమయంలో ఇష్టం లేకపోయినా.. తెలంగాణ ఉద్యమంలో లేనివారిని ప్రభుత్వంలోకి తీసుకుని ఉంటారని ఆయన విశ్లేషించారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడని, ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలను చాలా మంది వ్యతిరేకించారన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు రావడంతో వారంతా ఆయనకు జేజేలు పలుకుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ఉద్యమకారులెవరినీ మరిచిపోరని, ఎవరికి, ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు తెలుసన్నారు. దీర్ఘకాలికంగా ఉద్యమకారులకు మంచి భవిష్యత్ ఉంటుందని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సకలజనుల సమ్మె, సహాయ నిరాకరణ, తెలంగాణ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని, ఆనాటి ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకు, యువత కుటుంబాలకు రుణపడి ఉంటామన్నారు.
నా మాటలను మీడియా వక్రీకరించింది
యాజమాన్యాలకు లీగల్ నోటీస్ ఇస్తా
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని తాను అన్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. మహబూబ్‌నగర్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి ప్రచారాలు మీడియాకు మంచిది కాదన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమే కానీ, కేసీఆర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నట్లు ఆయన స్పష్టం చేశారు. తాను మంత్రివర్గంపై ఆరోపణలు చేసినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. మంత్రి పదవి రావడం తన చేతుల్లో లేదని.. అది కేసీఆర్ చేతుల్లో ఉందన్నారు. తనపై దురుద్దేశంతోనే అసత్య ప్రచారం చేస్తున్న పత్రికా యాజమాన్యాలకు లీగల్ నోటీసులను ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు చాలా కుట్రలు చేస్తున్నారని అలాంటిదే తనపై ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేశా రు. తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment