ఇక మిగిలింది పట్టాభిషేకమే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వా త పన్నెండేళ్లు అరణ్యవాసం, ఓ ఏడాది అజ్ఞాతవాసం పూర్తయిందని, ఇక 14వ ఏట పట్టాభిషేకమే మిగిలిం దని టీఆర్‌ఎస్ శాసనసభ్యులు కె.తారక రామారావు అన్నారు. రెండు ఎంపీలు న్న పార్టీ వల్ల తెలంగాణ రాలేదంటూ కొందరు అవమానిస్తున్నారని, వారికి వచ్చే ఎన్నికల్లో రెండు సీట్లు కూడా రావని హెచ్చరించారు. శుక్రవారం టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్, కేటీఆర్ సమక్షంలో జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చామని, తెచ్చామని చెప్పుకోవడం సరికాదని, తెలంగాణ వారంతట వారే ఇవ్వలేదని, ఇవ్వాల్సిన అనివార్యత వచ్చిందన్నారు.
2004లో మాట ఇచ్చిన కాంగ్రెస్ ఐదేళ్ల పాటు ఇవ్వకుండా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొని, పార్టీని చిదిమేసే ప్రయత్నం కూడా చేసిందని విమర్శించారు. పార్టీ నామరూపాల్లేకుండా పోయిందనే నిరాశా, నిస్పృహలతో చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీలోని ఎమ్మెల్యేలంతా గుంపులుగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని, ఇక తెలంగాణలో టీడీపీకి తావులేదని చెప్పారు. ఈటెలరాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదని, ఆయన పక్క రాష్ట్రానికి చెందిన నాయకుడన్నారు.