
చంద్రబాబు కోరిక తీర్చాం: దిగ్విజయ్
న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని విభజించాలనే చంద్రబాబు కోరికను తాము తీర్చామని, అయినా ఆయన ఎందుకు దీక్ష చేస్తున్నారో తమకు తెలియడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ అన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని చంద్రబాబు స్వయంగా తమకు లేఖ రాసిచ్చారని వెల్లడించారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ డీజీపీ దినేష్రెడ్డి చేస్తున్నవన్ని నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు. తన పదవిని పొడింగించలేదనే అక్కసుతోనే ఆయనీ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
రాష్ట్ర విభజన తీరు సరిగా లేదంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ నిన్న వ్యంగ్యంగా స్పందించారు. ‘విభజన తీరు సరిగా లేకుంటే ఎలా ఉండాలో ఆయన్నే చెప్పమనండి’ అంటూ వ్యాఖ్యానించారు. విభజనపై అన్ని పార్టీలను సంప్రదించామని, టీడీపీ సహా దాదాపు అన్ని పార్టీలు పలు సందర్భాల్లో విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయని వివరించారు. ఇప్పుడు ఆ పార్టీలు వైఖరులు మార్చుకుంటే కాంగ్రెస్ ఏం చేస్తుందని ఆయన సూటిగా ప్రశ్నించారు.