‘ఉదండాపూర్’ ప్రాజెక్టు మాకొద్దు..!
రిజర్వాయర్ సర్వే పనులను అడ్డుకున్న గ్రామస్తులు
జడ్చర్ల: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో నిర్మించనున్న ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను స్థానిక రైతులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. శనివారం సర్వే చేయడానికి వచ్చిన సిబ్బంది నుంచి వల్లూరు, ఉదండాపూర్, సమీప గిరిజన తండాల ప్రజలు సామగ్రిని లాక్కొని వెనక్కి వెళ్లాల్సిందిగా డిమాండ్ చేశారు. ఊరు, భూమి లేకుండా చేసే రిజర్వాయర్ తమకు అక్కర్లేదన్నారు. ‘చివరికి కట్టెలు అమ్ముకుని బతుకుతాం గానీ భూములను, ఊరిని వదిలేది లేదని’ స్పష్టం చేశారు.
ఇంతలో ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించింది. అక్కడే ఉన్న కొందరు ఆమెను వారించారు. సర్వే సిబ్బంది వాహ నం ఎదుట గొంతుకు ఉరి బిగించుకుని మహిళలు, ప్రజాప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న డిజైన్‌కు అనుగుణంగా తమ భూములకు, ఊళ్లకు,తండాలకు ఇబ్బం లేకుండా ఏడు టీఎంసీల రిజర్వాయర్‌ను నిర్మిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ ఏకంగా 15-17 టీఎంసీల భారీ రిజార్వాయర్ నిర్మించడానికి తాము వ్యతిరేకమన్నారు.
పరిహారంపై స్పష్టమైన హామీలు ఇవ్వకుండా భూములు లాక్కొనాలని చూస్తే ఆత్మహత్యలు చేసుకుంటామన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఈ ఘటనపై ఆరాతీశారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడి, సర్వేకు అడ్డుతగల వద్దని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.