చలిపులి వచ్చేసింది... వణుకు మొదలైంది...
తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
వేగంగా మారిపోతున్న వాతావరణం
తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వైపు తూర్పు గాలులు
వణికిస్తున్న చలిగాలులు
సాక్షి, విశాఖపట్నం/నర్సీపట్నం: రాష్ట్ర ప్రజల్ని వణికించడానికి చలిపులి వచ్చేసింది. వాతావరణంలో వేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. చలి గాలులు ప్రారంభమయ్యాయి. ఇక చలి కాలం ప్రారంభమైనట్టేనని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. అల్పపీడనాలు, వర్షాలు వెళ్లిపోవడం.. తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో త్వరలోనే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనాల అనంతరం వాతావరణంలో మార్పులొస్తున్నాయని వారు చెప్పారు.
ఈశాన్య గాలుల్లో మార్పు
ఉండ్రాలతద్దికి ఉండ్రాయంత.. అట్లతద్దికి అట్టు అంత.. దీపావళి ముందు దీపమంత అంటూ పూర్వం చలికాలం రాకను అంచనా వేసేవారు. గత నెల 21న అట్లతదియ వచ్చింది. అదే సమయానికి విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో తగ్గుముఖం కనిపించింది. పదిరోజుల వ్యవధిలో అన్ని ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతల్లో మార్పు కనిపించింది. గాలుల వేగం తగ్గింది. మబ్బులు దట్టంగా ఆవరిస్తున్నాయి. వర్షాల జాడ లేదు. దీంతో చలికాలం వచ్చేసినట్టేనని అధికారులు చెబుతున్నారు. నాలుగైదు రోజుల్లో చలి ప్రభావం పూర్తిస్థాయిలో కనిపిస్తుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. వాస్తవానికి ఈశాన్య గాలుల కదలికలో స్వల్ప తేడా కనిపిస్తోందని, పది రోజుల క్రితమే వీటిలో మార్పులు రావాల్సి ఉండగా కొంత ఆలస్యమైందని చెప్పారు. అక్టోబర్ మాసాంతంలో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల 37 డిగ్రీల వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, గడచిన 24 గంటల్లో రెంటచింతలలో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతల్లో మాత్రం గణనీయమైన మార్పు కనిపించింది.
ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లలో ప్రారంభమైన ఈస్టర్లీ విండ్స్ (తూర్పు నుంచి దక్షిణం మీదుగా వీచే గాలులు) తెలంగాణ మీదుగా కోస్తావైపు నెమ్మదిగా వస్తున్నట్టు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో చలికాలం తొలుత తెలంగాణలోనే ప్రారంభమవుతుందని, 26 డిగ్రీల లోపు గరిష్ట ఉష్ణోగ్రతలు, 17 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే తాము చలికాలం ప్రారంభమైనట్లు అంచనాకొస్తామని వారు తెలిపారు. బుధవారం-గురువారం మధ్య ఆదిలాబాద్‌లో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయన్నారు.
మంచు పరదాలో విశాఖ మన్యం: విశాఖ జిల్లా ఏజెన్సీని మంచు పరదా కప్పేస్తోంది. ఉదయం పది అయినా భానుడి జాడ కానరావడంలేదు. సాయంత్రం నాలుగు గంటలకే తన పని ముగించేస్తున్నాడు. దీంతో ఏజెన్సీ వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకే మంచు తెరలు వాలిపోతున్నాయి. రాత్రిళ్లు చలిగాలులు వీస్తున్నాయి. దట్టంగా మంచుకమ్మేస్తోంది. ఉదయం పది గంటల వరకు మంచు తెరలు వీడడం లేదు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సముద్రమట్టానికి నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉన్న చింతపల్లి, పెదవలస, లంబసింగిల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు శనివారం 18 డిగ్రీలు, ఆదివారం 16 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో రెండేళ్లుగా మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు న మోదైన విషయం తెలిసిందే. ఈ సారి కూడా మైనస్ డిగ్రీలు నమోదవవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇరవైకి అటూఇటూ
రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీలకి అటూఇటుగా నమోదవుతోంది. తెలంగాణలో చలి జోరు పెరిగింది. దీనిలో ఆదిలాబాద్ జిల్లా ముందుంది. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 17.5 డిగ్రీలు నమోదైంది. కరీంనగర్‌లో 20.4, నిజామాబాద్‌లో 21.0, మహబూబ్‌నగర్‌లో 22.1, మెదక్‌లో 21.5, వరంగల్‌లో 22.5, హైదరాబాద్‌లో 22.8గా నమోదైంది. సీమాంధ్ర ప్రాంతంలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను చలిగాలులు వణికిస్తున్నాయి.
ఈ రెండు జిల్లాల ముఖ్య కేంద్రాల్లో 21.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కాగా రాయలసీమలోని అనంతపురంలో కనిష్ట ఉష్ణోగ్రత 22.4గా ఉంది. ప్రకాశం, నెల్లూరుకు వర్ష సూచన: తమిళనాడు తీరంలో అల్పపీడనద్రోణి కొనసాగుతుండడంతో రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రానున్న 24 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో సోమవారం సాయంత్రంలోపు వాతావరణంలో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదన్నారు. ఈశాన్య రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో చాలా చోట్ల మబ్బులు దట్టంగా ఉంటాయన్నారు.