నేను 2010 నుంచి ఎల్‌ఐసీ మార్కెట్ ప్లస్ వన్ ప్లాన్‌లో ఏడాదికి రూ. 3 లక్షలు చొప్పున పెట్టుబడులు పెడుతున్నాను. ప్రస్తుతమున్న మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఈ స్కీమ్ నుంచి వైదొలగమని నా ఏజంట్ సలహా ఇస్తున్నాడు. తక్కువ రిస్క్ ఉన్న బీమా బడ్జెట్‌కు మారిపోవడం సముచితంగా ఉంటుందా? తెలియజేయగలరు? - నవీన్, హైదరాబాద్
ఎల్‌ఐసీ మార్కెట్ ప్లస్ అనేది యూనిట్ లింక్డ్ డిఫర్డ్ పెన్షన్ ప్లాన్. రిటైర్‌మెంట్ అవసరాల కోసం మీరు ఈ స్కీమ్‌లో పెట్టుబడులు పెట్టారనుకుంటున్నాను. మీకు మీ ఆర్థిక లక్ష్యాల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే మీరు సరైన ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌ను ఎంచుకోగలరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న స్కీమ్ లక్ష్యాలను సరిగ్గా అవగాహన చేసుకోవాలి. ఇక మీ ప్రశ్న విషయానికొస్తే, మీకు రెండు మార్గాలున్నాయి. 1) ఈ పాలసీని సరెండర్ చేసి మీ సొమ్ములన్నింటినీ వెనక్కి తీసుకోవడం. 2) ఈ పాలసీకి ప్రీమియంలు చెల్లించడం ఆపేయడం, దీంతో రెండేళ్ల తర్వాత బీమా సంస్థ ఈ పాలసీని మీకు ఆటోమాటిక్‌గా సరెండర్ చేస్తుంది. అయితే ఈ రెండేళ్ల పాటు మీకు లైఫ్ కవర్ కొనసాగుతుంది. రైడర్ బెనిఫిట్స్ కూడా అందుతాయి. అవసరమైన చార్జీలను బీమా సంస్థ మినహాయించుకుంటుంది. ఈ రెండు విధానాల్లోనూ ఎలాంటి సరెండర్ చార్జీలు ఉండవు.
ఇక ఎల్‌ఐసీ బీమా బచత్ విషయానికొస్తే రూ. 1 లక్ష కవర్‌కు రూ.67,000 పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. అందుకే దీనిని అత్యంత ఖరీదైన పాలసీగా పరిగణిస్తారు. మీకు లైఫ్ కవర్ కూడా అవసరం అనుకుంటే, ప్యూర్ టెర్మ్ ప్లాన్ తీసుకోవడం ఉత్తమం. ఇప్పటివరకూ చౌకలో లభిస్తున్న బీమా పాలసీలు ఇవే. బీమా అవసరాలను ఇన్వెస్ట్‌మెంట్ అవసరాలతో కలిపి చూడవద్దని ఎప్పటికప్పుడు పేర్కొంటూనే ఉన్నాం. రిటైర్మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ అవసరాల కోసం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఐపీ)ను పరిశీలించవచ్చు. మీరు భరించే రిస్క్‌ను బట్టి ఈక్విటీ ఫండ్స్ లేదా డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ల్లో సిప్ ద్వారా పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. మీరు మీ ఆర్థిక లక్ష్యాలకు చేరువలో ఉన్నప్పుడు డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌కు మారడం మంచిది.
రిలయన్స్ డైవర్సిఫైడ్ పవర్ సెక్టార్ ఫండ్‌లో నెలకు రూ.2,000 చొప్పున సిప్ విధానంలో పెట్టుబడులు పెడుతున్నాను. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(ఆర్‌ఐఎఫ్)ను రిలయన్స్ డైవర్సిఫైడ్ పవర్ సెక్టార్ ఫండ్‌లో విలీనం చేస్తున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ఫలితంగా నా పెట్టుబడులపై ఏమైనా ప్రభావం ఉంటుందా?
- గీతా మాధవ్, తిరుపతి
రెండు ఫండ్స్ విలీనం తర్వాత కొనసాగే ఫండ్‌కు సంబంధించిన ఇన్వెస్టర్లపై విలీన ప్రభావం ఏమీ ఉండదు. మీ విషయానికొస్తే మీరు పెట్టుబడులు పెడుతున్న రిలయన్స్ డైవర్సిఫైడ్ పవర్ సెక్టార్ ఫండ్‌లో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ విలీనం అయింది. ఈ విలీనం తర్వాత మీరు పెట్టుబడులు పెడుతున్న ఫండ్ కొనసాగుతోంది. కాబట్టి మీపై ఈ విలీనం ప్రభావం ఏమీ ఉండదు. విలీన నిష్పత్తిని బట్టి రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఇన్వెస్టర్లకు రిలయన్స్ డైవర్సిఫైడ్ పవర్ సెక్టార్ ఫండ్ యూనిట్లు లభిస్తాయి. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఆస్తులన్నీ రిలయన్స్ డైవర్సిఫైడ్ పవర్ సెక్టార్ ఫండ్‌కు బదిలీ అవుతాయి కాబట్టి రిలయన్స్ డైవర్సిఫైడ్ పవర్ సెక్టార్ ఫండ్ అసెట్స్ ఆ మేరకు పెరుగుతాయి. విద్యుత్ కంపెనీలు, విద్యుత్ సంబంధిత కంపెనీల్లో రిలయన్స్ డైవర్సిఫైడ్ పవర్ సెక్టర్ ఫండ్ పెట్టుబడులు పెడుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఫండ్ పనితీరు ఒడిదుడుకులమయంగా ఉంది. ఇలాంటి రంగాల వారీ ఫండ్స్ ఆ రంగాల్లో వచ్చే ఒడిదుడుకులకు అనుగుణంగా రిస్క్‌లకు గురవుతుంటాయి. మీ పోర్ట్‌ఫోలియోలో ఇదొక్క ఫండే ఉంటే మీరు మరో డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టడం తప్పనిసరి.