‘మా ఆయన చెప్పినవన్నీ కరెక్టే’
న్యూఢిల్లీ: తన భర్త వెలుగులోకి తెచ్చిన విషయాలన్నీ వాస్తవమేనని, ఆయన చేసిన పని కరెక్టేనని బీఎస్‌ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్ భార్య తెలిపారు. బహదూర్ యాదవ్ మానసిక పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. ఆయనకు మతిస్థిమితం లేకపోతే సరిహద్దులో ఎలా విధులు నిర్వహిస్తారని ఎదురు ప్రశ్నించారు. మంచి ఆహారం పెట్టామని అడగడం తప్పుకాదని బహదూర్ యాదవ్ కుమారుడు రోహిత్ అన్నాడు. సైనికుల సరైన ఆహారం అందిచడం లేదని, దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశాడు. తమకు న్యాయం జరగాలని ఆకాంక్షించాడు.
జమ్మూకశ్మీర్ 29వ బెటాలియన్ లో జవానుగా పనిచేస్తున్న తేజ్ బహదూర్ యాదవ్ ఇటీవల ఫేస్ బుక్ లో పోస్ట్‌చేసిన వీడియో దుమారం రేపింది. సరిహద్దులో అత్యంత ప్రతికూల వాతావరణంలో విధులు నిర్వహిస్తున్న తమకు నాసిరకం ఆహారాన్ని పెడుతున్న వైనాన్ని వీడియోల్లో చిత్రీకరించి బయటి ప్రపంచానికి తెలిసేలా చేశాడు. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దర్యాప్తుకు ఆదేశించారు.
కాగా, సోమవారం సాయంత్రం నుంచి తేజ్ బహదూర్ యాదవ్ అదృశ్యమయ్యాడని అతడి భార్య వెల్లడించింది. ఫోన్ లో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాడని, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు తేజ్ బహదూర్ యాదవ్ పై క్రమశిక్షణ చర్య తీసుకుంటామని బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ డి.కె. ఉపాధ్యాయ మంగళవారం తెలిపారు.