షికాగో: అందమైన వ్యక్తులు ఎదురుపడినప్పుడు కొందరిపై తీవ్ర వ్యామోహం.. మరికొందరిపై పవిత్రమైన ప్రేమ భావనను అనుభూతి చెందుతుంటారు. అందరూ అందంగానే ఉన్నప్పటికీ.. కొందరిపై మాత్రమే మోహం, మరికొందరిపై మాత్రమే ప్రేమ ఎందుకంటే.. మెదడులోని ఓ భాగం చేసే మాయాజాలం వల్లేనంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ షికాగో శాస్త్రవేత్తలు. మెదడులో బాగా లోపల ఉండే ‘ఇన్సులార్ కార్టెక్స్’ అనే భాగం స్పందించే తీరు వల్లే వ్యామోహం లేదా ప్రేమ భావనలు కలుగుతాయని వారు అంటున్నారు. మెదడు దెబ్బతిన్న ఓ రోగిపై పరిశోధించిన తాము ఈ విషయాన్ని గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇన్సులార్ కార్టెక్స్‌లోని ముందువైపు భాగం యాంటీరియర్ ఇన్సులా ప్రేమ భావన కలగడంలో, వెనకవైపు భాగం పోస్టీరియర్ ఇన్సులా కామ భావన కలగడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వారు వెల్లడించారు. మోహ భావనలకు గురైనప్పుడు రోగి మెదడులో స్పందనలు చాలా వేగంగా, ప్రేమ భావనలప్పుడు చాలా నెమ్మదిగా జరిగినట్లు గుర్తించారు. పరిశోధనలో భాగంగా.. అందమైన యువతుల్లో కొందరు చిట్టిపొట్టి డ్రెస్‌లు ధరించి, మరికొందరు నిండుగా దుస్తులు ధరించి రోగితో సన్నిహితంగా మెలుగుతూ మాట్లాడారు. ఆ సందర్భంగా రోగిలో కలిగిన భావనలను, అతడి మెదడులో జరిగిన మార్పులను శాస్త్రవేత్తలు పరిశీలించారు.