వాట్సాప్‌లో ఫిర్యాదులు | WhatsApp in Complaints | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో ఫిర్యాదులు

Published Tue, Mar 8 2016 3:15 AM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM

వాట్సాప్‌లో ఫిర్యాదులు

వాట్సాప్‌లో ఫిర్యాదులు

ఓటర్లను మభ్య పెట్టడం, తాయిలాల పంపిణీ, వీరంగాలు సృష్టించే యత్నం చేసినా మొబైల్ ఫోన్లలోని  కెమెరాల రూపంలో రాజకీయ పక్షాల్ని నిఘా వెంటాడబోతున్నది. వాట్సాప్ రూపంలో ఫిర్యాదులు, సమాచారాలు అందించే ప్రక్రియకు ఎన్నికల యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ప్రత్యేక మొబైల్ యాప్‌ను సైతం ప్రవేశపెట్టింది. ఎన్నికల కసరత్తుల్ని వేగవంతం చేస్తూ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
 
సాక్షి, చెన్నై: ఇటీవల కాలంలో విస్తరిస్తున్న టెక్నాలజీ, ఆండ్రాయిడ్ మొబైల్స్ రాక పరిణామాలతో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వాట్సాప్‌ల రూపంలో వెలుగులోకి వచ్చే అంశాలు మొబైల్ ఫోన్లలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పక్షాలకు ముచ్చెమటలు పట్టించే దిశగా వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు, సమాచారాల స్వీకరణకు ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపట్టడం గమనార్హం.

అధికారులు తమ వాళ్లే కదా, అనుకుని ఇష్టారాజ్యంగా ఎక్కడైనా రాజకీయ పక్షాలు వ్యవహరించినా, వారి నీడన ఓటర్లను మభ్య పెట్టడం, తాయిలాల పంపిణీ వంటి చర్యలకు పాల్పడ్డారో.. మొబైల్ ఫోన్లే నిఘా నేత్రాల రూపంలో వెంటాడబోతున్నాయి.  అధికారుల గానీయండి, పోలీసులు గానీయండి ..ఇలా ఎవరు ఏ తప్పు చేసినా చటుక్కున వాట్సాప్‌లో వీడియోలు  లేదా, ఆడియో రూపంలో సమాచారాలు బయట పడుతున్నాయి. చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు తప్పును నిలదీస్తామన్నట్టుగా ముందుకు వెళ్లే యువతరం, ఇక రాజకీయ పక్షాల భరతం పట్టే దిశగా తమ ఫోన్లను ఉపయోగించుకునే వీలు కల్గిస్తూ ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపట్టింది.

ఫిర్యాదుల్ని, సమాచారాల్ని, 9444123456 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపించే అవకాశం కల్పించి ఉంది. పాత విధానం 1950కు ఫోన్ కొట్టి ఫిర్యాదులూ చేయొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ కల్గినవాళ్లు  గూగుల్‌లో తమిళనాడు ఎలక్షన్ కమిషన్ అని టైప్ చేసి మొబైల్ యాప్‌ను సైతం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా కూడా ఫిర్యాదులు, సమాచారాల్ని చేరవేసే అవకాశం కల్పించి ఉన్నారు. వీటన్నింటిని పరిశీలించి తగు చర్యలు తీసుకునేందుకు తగ్గ  ప్రత్యేక బృందాల్ని సైతం రంగంలోకి దించారు.
 
రిటర్నింగ్ అధికారులకు శిక్షణ: రాష్ట్ర అసెంబ్లీకి మే 16న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. నామినేషన్ల పర్వం ఏప్రిల్ 22 నుంచి ఆరంభం అవుతుంది. ఎన్నికల కసరత్తుల్ని వేగవంతం చేస్తూ జిల్లాకు ఇద్దరు చొప్పున రిటర్నింగ్ అధికారుల్ని ఈసీ రాజేష్ లఖానీ ఎంపిక చేశారు. వీరికి ఎగ్మూర్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో సోమవారం శిక్షణా కార్యక్రమం జరిగింది. దీనిని ప్రారంభించిన రాజేష్ లఖానీ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన పలు సూచనలు, సలహాల్ని వారికి ఇచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్నికల కమిషన్ ప్రతినిధి విన్ఫోర్ట్ న్యాయ సంబంధింత అంశాల గురించి , నామినేషన్ల ప్రక్రియ పరిశీలన, అభ్యర్థులు పేర్కొన్న అంశాలు, తదితర వివరాలను తెలియజేశారు.

ఈ విషయంగా రాజేష్ లఖానీ మీడియాతో మాట్లాడుతూ జిల్లాకు ఇద్దరు చొప్పున 64 మందిని ఎంపిక చేశామని, వీరికి ఇక్కడ ఇచ్చే శిక్షణ తదుపరి ఆయా జిల్లాల్లో జరుగుతాయన్నారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు వీరు తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.ఈ  ప్రక్రియ ముగియగానే, తదుపరి ఈవీఎంల మీద దృష్టి పెట్టనున్నామన్నారు. తమిళనాడుకు అవసరమయ్యే ఈవీఎంలు ఇక్కడికి వచ్చాయని, వాటి పరిశీలన 90 శాతం ముగిసిందన్నారు. అనంతరం ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ర్యాండమ్ ప్రక్రియ సాగుతుందన్నారు. ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఆప్షన్స్ ప్రకటించి ఉన్నామన్నారు.

వాట్సాప్ ద్వారా సమాచారాల్ని అందించవచ్చు అని, అయితే, ఆ నెంబర్‌కు ఫోన్ చేయడానికి వీలు లేదన్నారు. ఈ సారి నామినేషన్లను కంప్యూటరీకరించనున్నామని, అందుకు తగ్గ వివరాలతో శిక్షణ సాగుతున్నదని పేర్కొన్నారు. నగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా 202 బృందాలు ప్రస్తుతం రంగంలోకి దిగాయని, దశల వారీగా ఈ సంఖ్యను పెంచుతామన్నారు. ఎన్నికలు న్యాయబద్దంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల్లో ఉన్న సీఎం ఫొటోలను మూసి వేయించడం, అవసరాన్ని బట్టి తొలగిస్తున్నామని పేర్కొన్నారు.  ఇప్పటి వరకు మూడు వందలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిష్కరించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement