'ప్రొఫెసర్ ఎప్పుడయ్యారు? ఎవరు చేశారు?'
పాట్నా: రాజకీయ నాయకుల్లో మార్పు వచ్చినంత వేగంగా బహుశా ఎవరిలోనూ రాకపోవచ్చు. ఎన్ని రకాల పాత్రలైనా ధరించడంలో వారికి వారే సాటి. నిన్న మొన్నటి వరకు వారంతా మిత్ర పక్షాలు.. కొన్ని సమావేశాల్లో ఖుషీఖుషీగా వేదికలు పంచుకున్నారు కూడా. బీహార్ ఎన్నికల్లో తామంతా కలిసి బీజేపీని మట్టికరిపిస్తామంటూ జనతా పరివార్ పేరిట జట్టుకట్టారు. కానీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎవరి దారి వారి చూసుకొని ఇప్పుడు వారిపై వారే విసుర్లు వేసుకుంటున్నారు.
లౌకికవాదానికి ములాయం సింగ్ యాదవ్ను ప్రొఫెసర్గా ఎప్పుడయ్యారు? ఎవరు తయారు చేశారు? అంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రశ్నించారు. ఆయన ప్రొఫెసర్ అయితే, తామంతా పరిశోధన విద్యార్థులమా అని వ్యగ్యంగా వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ'ములాయం లౌకిక వాద విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ అయితే, మేమంతా రీసెర్చ్ స్కాలర్సా' అని ప్రశ్నించారు.
గతవారం ఓ కార్యక్రమంలో ములాయం మాట్లాడుతూ పరోక్షంగా నితీశ్ కుమార్ ను ఉద్దేశించి.. ఎవరు లౌకికవాది? పన్నేండుళ్లుగా బీజేపీ మద్దతు తీసుకొని పరిపాలన సాగించిన వీరు లౌకిక వాదులా? అదేంటో ఒక్కసారిగా వారంతా లౌకికవాదులుగా మారారు అంటూ విమర్శించారు. ఈ మాటలు దృష్టిలో పెట్టుకొని తాజాగా నితీశ్ దాడి చేశారు.