రాష్ట్రపతి ఎన్నికలో స్వేచ్ఛ
►బీజేపీకి కలిసొచ్చిన యూపీ, ఉత్తరాఖండ్ గెలుపు
►వచ్చే ఏడాదికి రాజ్యసభలో 100కి చేరనున్న ఎన్డీఏ బలం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం బీజేపికి అనేక తీపికబుర్లు అందించింది. ఈ ఏడాది జరిగే రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అభ్యర్థి ఎంపికలో స్వతంత్రంగా వ్యవహరించే అవకాశంతో పాటు, వచ్చే ఏడాది రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా నిలిచేందుకు ఆస్కారమిచ్చింది. తాము నిర్ణయించిన అభ్యర్థి రాష్ట్రపతి భవన్‌లో ఉంటే.. కొన్ని కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం పొందడం సులభమవుతుందని బీజేపీ భావిస్తోంది.
ఈ ఏడాది జులై 25న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపొందాలంటే మొత్తం 10,98,822 ఎలక్టోరల్ ఓట్లలో 50.1 శాతం సాధించాలి. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు బీజేపీ అభ్యర్థి గెలుపునకు 75 వేల ఓట్లు తక్కుపడ్డాయి. తాజా ఫలితాలతో ఆ లోటు 20 వేలకు తగ్గిందని ఎన్నికల కమిషన్ అధికారి ఒకరు వెల్లడించారు. అన్నాడీఎంకేకు చెందిన 134 మంది ఎమ్మెల్యేలు, బీజేడీ 117 మంది ఎమ్మెల్యేల మద్దతు తీసుకుంటే.. రాష్ట్రపతి ఎన్నికల్లో స్వేచ్ఛగా తన అభ్యర్థిని ఎనుకునే అవకాశం బీజేపీకి కలుగుతుంది.
రేసులో మహాజన్, రాంనాయక్, సుష్మ, జాదవ్‌లు!
బీజేపీ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, యూపీ గవర్నర్ రామ్ నాయక్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ప్రముఖ దళిత నేత నరేంద్ర జాదవ్, కేంద్ర మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్‌ల పేరు వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించవచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. ఉప రాష్ట్రపతి అభ్యర్థి రేసులో అకాలీ నేత ప్రకాశ్ సింగ్ బాదల్, బీజేపీ నేత వెంకయ్య నాయుడులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాదికి రాజ్యసభలోను బీజేపీదే హవా..
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో 243 మంది సభ్యులున్న రాజ్యసభలో వచ్చే ఏడాది కల్లా బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలవనుంది. రాజ్యసభలో ఎన్డీఏ ఎంపీల సంఖ్య 100కు పెరుగుతుంది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి 56 మంది సభ్యులుండగా, కాంగ్రెస్‌కు 59 మంది ఉన్నారు. అదే విధంగా వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లు సులభంగా ఆమోదం పొందేందుకు ఈ ఎన్నికలు అవకాశం కల్పించాయి. జీఎస్టీ ఆమోదానికి లోక్‌సభలో బీజేపీకి తగిన సంఖ్యాబలం ఉన్నా... రాజ్యసభలో మాత్రం విపక్షాలదే పైచేయి. తాజా విజయంతో రాజ్యసభలో బిల్లును వ్యతిరేకించే వారి సంఖ్య తగ్గవచ్చనేది బీజేపీ భావన.
యూపీ సభ్యుడి ఎలక్టోరల్ విలువ ఎక్కువ
పార్లమెంట్‌లోని ఉభయసభల సభ్యులు, 29 రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఈ ఎన్నికల్లో 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలకు ఓటేసే అవకాశముంటుంది. లోక్‌సభ స్పీకర్ కూడా ఓటేయవచ్చు. అయితే లోక్‌సభలోని ఆంగ్లో ఇండియన్ సభ్యులు, రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులకు ఓటేసే అధికారం లేదు. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, అస్సాంలో బీజేపీ అధికారంలో ఉండగా... ఆంధ్రప్రదేశ్, జమ్మూ కశ్మీర్‌లో సంకీర్ణ భాగస్వామిగా కొనసాగుతోంది.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల్లో గెలుపుతో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని మరింత సులభతరం చేసింది. యూపీలో ప్రతి అసెంబ్లీ సభ్యుడికున్న ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల విలువ 208... మహారాష్ట్రలో ఆ విలువ 175 మాత్రమే. అందుకే యూపీ 324 సీట్లలో ఎన్డీఏ విజయంతో రాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ పట్టును మరింత పెంచింది. ఇక 543 మంది సభ్యులున్న లోక్‌సభలో బీజేపీకి 281 మంది ఎంపీలుండగా... రాజ్యసభలో 56 మంది సభ్యులున్నారు.