ఖట్టర్ వైఫల్యంపై బీజేపీ మౌనం.. ఇందుకేనా?
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో గుర్మీత్ రామ్ రహీ సింగ్‌ను దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో హరియాణాలోని పంచకుల తగులబడడానికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అసమర్థతే కారణమని హరియాణా, పంజాబ్ హైకోర్టు తీవ్రంగా మందలించిన విషయం తెల్సిందే. ఇప్పటికీ కొనసాగుతున్న ఈ విధ్వంసకాండలో 31 మంది మరణించడం, 200 మందికిపైగా గాయాలపాలవడం అత్యంత విషాధకరం. ఇలాంటి సందర్భాల్లో ఆయన అసమర్థత బయట పడడం ఇదో మొదటి సారి కాదు. మూడుసార్లు ఆయన వైఫల్యం చెందారు. అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంగానీ, బీజీపీ అధిష్టానంగానీ ఆయన్ని ఏమీ అనదు. ఎందుకు? ఆయన వెనుక ఉన్నది ఎవరు?
2014లో జరిగిన అసంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ పేరు అనూహ్యంగా ముందుకు వచ్చింది. అప్పటికే హరియాణ ఆరెస్సెస్ ప్రచారక్‌గా ఖట్టర్ పనిచేస్తున్నప్పటికీ పార్టీకి వెలుపల ఆయనెవరో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు పార్టీలోగానీ, ప్రభుత్వంలోగానీ ఆయన ఏ పదవిని నిర్వహించలేదు. సరాసరి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత నెల రోజులకే, అంటే 2014, నవంబర్ నెలలో ఆయన అసమర్థత మొదటిసారి బయట పడింది. హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న బాబా రాంపాల్‌ను అరెస్ట్ చేసి తీసుకరావాల్సిందిగా కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయడానికి పోలీసులు బర్వాలాలోని ఆయన ఆశ్రమానికి వెళ్లినప్పుడు భక్తులను అడ్డంపెట్టుకొని తప్పించుకునేందుకు బాబా రాంపాల్ ప్రయత్నించారు. అప్పుడు కూడా ఖట్టర్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. చివరకు రాంపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ జరిగిన ఘర్షణల్లో ఆరుగురు అమాయక భక్తులు మరణించారు.
ఆ తర్వాత 2016లో ఉద్యోగ, విద్యారంగాల్లో తమకూ రిజర్వేషన్లు కల్పించాలంటూ జాట్లు చేసిన ఆందోళనను అరికట్టడంలోనూ మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం విఫలమైంది. హింసా, విధ్వంసకాండలో అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. సైన్యం రంగంలోకి దిగాకనే పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇప్పుడు రామ్ రహీమ్ సింగ్ అరెస్ట్ కారణంగా పంచకుల అంటుకోవడంతో కాంగ్రెస్, జాతీయ లోక్‌దళ్ పార్టీలు మనోహర్ రాజీనామాను డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ నేతలు కూడాడిమాండ్ చేస్తున్నారుగానీ వారు పేరు బహిర్గతం చేయడానికి ఇష్టం పడడం లేదు. ముఖ్యమంత్రి విధి నిర్వహణలో తన సలహాదారులు, సన్నిహిత ఆరెస్సెస్ నేతల సలహాలను తప్ప ఎవరి మాట వినిపించుకోరని బీజేపీ నేతలు వాపోతున్నరు.
ఆరుసార్లు శాసన సభ్యుడిగా విజయం సాధించిన రామ్ విలాస్ శర్మ, నాలుగు సార్లు ఎన్నికైన అనుల్ విజ్ లాంటి అనుభవజ్ఞులను వదిలేసి మనోహర్‌ను ఎందుకు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారో అర్థం కావడం లేదని స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని 1996లో హర్యానా పార్టీ ఇంచార్జీగా పార్టీ అధిష్టానం పంపించినప్పుడు పంచకులలో మోదీకి బస ఏర్పాటు చేసినదీ, ఆయనతోపాటు బసలో ఉన్నది మనోహర్ లాల్ ఖట్టర్ అనే విషయం గుర్తొస్తే ఆయన నియామకం వెనక ఎవరి హస్తం ఉన్నదో ఊహించడం పెద్ద కష్టం కాదు.