సీఎం ఖట్టర్ తొలగింపు: బీజేపీ క్లారిటీ
న్యూఢిల్లీ: గుర్మీత్ రాం రహీం సింగ్ మద్దతుదారుల విధ్వంసం నేపథ్యంలో హరియాణ ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్‌పై బీజేపీ అధిష్టానం వేటు వేయనుందని వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. హరియాణ సీఎంగా ఖట్టర్‌ను తొలగించే ప్రసక్తే లేదని బీజేపీ అధినాయకత్వం స్పష్టం చేసింది. హరియాణ బీజేపీ జనరల్ సెక్రటరీ డాక్టర్ అనిల్ జైన్, సీనియర్ నేత కైలాశ్ విజయ్‌వార్గియాతో భేటీ అయిన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ మేరకు స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. అంతేకాకుండా తాజా విధ్వంసం నేపథ్యంలో ఖట్టర్‌ను ఢిల్లీకి పిలిపించి.. వివరణ కోరే అవకాశం కూడా లేదని షా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీం సింగ్‌కు రేప్ కేసులో శిక్షపడటంతో ఆయన మద్దతుదారుల దాడులు, విధ్వంసంతో హరియాణ అట్టుడికిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున హింస తలెత్తడంతో హైకోర్టు సైతం సీఎం ఖట్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం పంచకుల తగలబడుతున్న చూస్తూ మిన్నకుండిపోయారని ఖట్టర్‌ను హైకోర్టు మందలించింది. అయినప్పటికీ ఖట్టర్‌పై చర్య తీసుకోరాదని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. డేరా స్వచ్ఛ సౌదాకు భారీ మద్దతు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున హింస తలెత్తకుండా ఖట్టర్ ప్రభుత్వం నియంత్రించగలిగిందని షా అభిప్రాయపడినట్టు సమాచారం.