Haryana cm Manohar Lal Khattar
-
జైలుకెళ్లండి.. నేతలవుతారు..
చండీగఢ్: జైలుకెళ్లి వస్తే నేతలవుతారంటూ హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ వ్యాఖ్యానించారు. బీజేపీ కిసాన్ మోర్చా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతు నిరసనలు జరుగుతున్న చోట్లకు బీజేపీ కార్యకర్తలు 500, 700, 1,000 చొప్పున గుంపులుగా వెళ్లాలని అన్నారు. రైతుల ‘భాష’లోనే వారికి సమాధానం చెబుదాం అని చెబుతున్న వీడియో వైరల్ అయింది. అందులో ఆయన ఇంకా మాట్లాడుతూ. ఒక వేళ జైలుకెళ్లిన బాధపడవద్దని, జైలుకెళ్తే మహా అయితే నెలో, మూడు నెలలో ఉంటారని, కానీ ఆ తర్వాత పెద్ద నేతలవుతారని అన్నారు. చరిత్రలో పేర్లు నిలిచిపోతాయని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. రైతులపై దాడులు చేయాలంటూ రాష్ట్ర సీఎంగా ఉన్న వ్యక్తి రెచ్చగొడుతున్నారని ఆరోపించింది. ఇలా చేయడానికి మోదీ–నడ్డాల అనుమతి తీసుకున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేసింది. హింసను ప్రోత్సహిస్తూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చెబుతుంటే ఇక రాష్ట్రంలో రాజ్యాంగం ఎలా నడుస్తుందని ప్రశ్నించింది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) నేత అభయ్ సింగ్ చౌతాలా దీనిపై స్పందించారు. ముఖ్యమంత్రి మీద దేశద్రోహం కింద కేసు పెట్టాలని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
రికవరీ రేటు 75.27%
న్యూఢిల్లీ: దేశంలో సోమవారం మరో 61,408 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,06,348కు చేరుకుంది. కరోనా కేసులు 30 లక్షల నుంచి 31 లక్షలకు కేవలం ఒక్క రోజులోనే చేరుకున్నాయి. 24 గంటల్లో 57,469 మంది కోలుకోగా, 836 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 57,542కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 23,38,035కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,10,771గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 22.88గా ఉంది. యాక్టివ్ కేసుల కంటే మూడు రెట్లు కోలుకున్న కేసులు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా రికవరీ రేటు 75.27 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.85 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 22 వరకు 3,52,92,220 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శనివారం మరో 8,01,147 శాంపిళ్లను పరీక్షించినట్లు చెప్పింది. ఆదివారం మరో 6,09,917 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 3,59,02,137 కు చేరింది. పరీక్షల్లో వస్తున్న పాజిటివిటీ రేటు 8% కంటే తక్కువగా ఉంది. హరియాణా సీఎంకు కోవిడ్ చండీగఢ్/పణజి: హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కోవిడ్ బారిన పడ్డారు. వారం క్రితం ఆయన కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత షెకావత్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. తన రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా వచ్చిందంటూ సీఎం ఖట్టర్ సోమవారం ట్విట్టర్లో తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ జ్ఞాన్‌చంద్ గుప్తా, బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా పాజిటివ్‌గా తేలింది. కేంద్ర మంత్రికి తగ్గిన ఆక్సిజన్ స్థాయిలు కోవిడ్–19తో చికిత్స పొందుతున్న కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గినట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెల్లడించారు. ఆయన్ను పరీక్షించేందుకు ఢిల్లీ నుంచి వైద్యాధికారుల బృందం రానుందన్నారు. -
సుశాంత్ తండ్రికి హర్యానా సీఎం పరామర్శ
చంఢీగడ్ : హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ శనివారం సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్‌ని పరామర్శించారు. ఫరిదాబాద్‌లోని సుశాంత్ సోదరి నివాసానికి స్వయంగా వెళ్లిన ముఖ్యమంత్రి వారిని ఓదార్చారు. జూన్ 14న సుశాంత్ సింగ్‌ముంబైలోని బాంద్రాలో గల నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన తెలిసిందే. సుశాంత్ మృతికి రియానే కారణమంటూ కేకే సింగ్ పట్నా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది. దీంతో కేసు విచారణను సీబీఐకి అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా రియా చక్రవర్తితో పాటు ఆమె కుటుంసభ్యులను పేర్లను ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది. (తనపై అత్యాచారం జరుగలేదు, గర్భవతి కాదు) ఇక సుశాంత్ కేసు విచారణ మొదలైనప్పటి నుంచి అఙ్ఞాతంలోకి వెళ్లిపోయిన రియా చక్రవర్తి ఎట్టకేలకు శుక్రవారం ముంబైలోని ఈడీ కార్యాలయం ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. మొదట తాను హాజరుకానంటూ ఈ-మెయిల్ సందేశం పంపినా ఈడీ సమస్ల నేపథ్యంలో హాజరు కాక తప్పలేదు. ఈ నేపథ్యంలో సుమారు 8 నుంచి తొమ్మిది గంటల పాటు అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. కాగా సుశాంత్ అకౌంట్ నుంచి రియా దాదాపు 15 కోట్ల రూపాయల మేర తన అకౌంట్‌కు బదిలీ చేయించుకుందని అతడి తండ్రి కేకే సింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. (నా సొంత ఆదాయం నుంచే ఖర్చు: రియా ) Haryana Chief Minister Manohar Lal Khattar meets actor #SushantSinghRajput's father KK Singh and his sister Rani Singh in Faridabad. The actor died by suicide at his residence in Mumbai, Maharashtra on June 14. Central Bureau of Investigation (CBI) is probing his death case. pic.twitter.com/AiqiWZmYOr — ANI (@ANI) August 8, 2020 -
రేపటి నుంచి ప్రజా రవాణా ప్రారంభం
చంఢీగర్: శుక్రవారం నుంచి హర్యానాలో ప్రయోగాత్మక ప్రాతిపదికన ప్రజా రవాణాను ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. ఈ మేరకు సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మార్చి 25న దేశ వ్యాప్తంగా మొదటి దశ లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి ప్రజా రవాణా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే మూడవ దశ లాక్డౌన్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని కార్యకలపాలకు అనుమతిచ్చాయి. కానీ ప్రజా రవాణా వ్యవస్థను మాత్ర పునరుద్ధరించలేదు. (ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆ ఛాన్స్!) అయితే గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రకటించాయి. ఈ క్రమంలో శుక్రవారం నుంచి హర్యానాలో ప్రజా రవాణాను ప్రారంభిస్తున్నట్లు ఖట్టర్ ప్రకటించారు. ఇందుకోసం బస్సులను శానిటైజ్ చేయడమే కాక సామాజిక దూరాన్ని పాటించేలా సీట్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణ సమయంలో ప్రజలంతా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని.. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.(5 లక్షల సలహాల్లో ఎక్కువ వాటికే: కేజ్రీవాల్) -
వైద్య సిబ్బందికి రెట్టింపు వేతనం: సీఎం
హర్యానా : కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలు రక్షించే వైద్యసిబ్బంది కోసం హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి రెట్టింపు వేతనం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ‘కరోనా వైరస్ ఉన్నంత కాలం, ఆ విభాగంలో సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది అందరికీ రెట్టింపు వేతనం ఇస్తాం .’ అని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. దీంతో పాటు కరోనా వైరస్ విధుల్లో పోలీసులు ఎవరైనా చనిపోతే ఆయా కుటుంబాల వారికి రూ.30లక్షల పరిహారం కూడా ఇస్తామని ప్రకటించారు. As long as the #COVID19 pandemic lasts, those who are involved in care, treatment or testing of #COVID19 patients, will be paid double the amount of their salary: Haryana Chief Minister Manohar Lal Khattar pic.twitter.com/1l3D4Nh2K3 — ANI (@ANI) April 9, 2020 కరోనావైరస్ పై పోరాటంలో మానవాళిని కాపాడటానాకి తమ ప్రాణాలను పణంతా పెట్టిన వైద్యులు, నర్సులను దేవుళ్లుగా అభివర్ణించిన ఖట్టర్.. వైద్యులు, నర్సులు, పారామెడికల్ ఇతర సిబ్బందికి వరుసగా రూ .50 లక్షలు, రూ .30 లక్షలు, రూ .20 లక్షలు, రూ .10 లక్షలు ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఇది కేంద్రం ప్రకటించిన .(లక్షా 70వేల కోట్ల ప్యాకేజీలో ) ఇన్సూరెన్స్ పరిధిలోకి రానివారికి వర్తిస్తుంది. వైద్యులు ఇతర వైద్య సిబ్బంది కృషిని గుర్తించి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇప్పటి వరకు హర్యానాలో 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 5865 కరోనా కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులో 5218 చికిత్స పొందుతున్నారు. 477 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. -
ఖట్టర్ వైఫల్యంపై బీజేపీ మౌనం.. ఇందుకేనా?
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో గుర్మీత్ రామ్ రహీ సింగ్‌ను దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో హరియాణాలోని పంచకుల తగులబడడానికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అసమర్థతే కారణమని హరియాణా, పంజాబ్ హైకోర్టు తీవ్రంగా మందలించిన విషయం తెల్సిందే. ఇప్పటికీ కొనసాగుతున్న ఈ విధ్వంసకాండలో 31 మంది మరణించడం, 200 మందికిపైగా గాయాలపాలవడం అత్యంత విషాధకరం. ఇలాంటి సందర్భాల్లో ఆయన అసమర్థత బయట పడడం ఇదో మొదటి సారి కాదు. మూడుసార్లు ఆయన వైఫల్యం చెందారు. అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంగానీ, బీజీపీ అధిష్టానంగానీ ఆయన్ని ఏమీ అనదు. ఎందుకు? ఆయన వెనుక ఉన్నది ఎవరు? 2014లో జరిగిన అసంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ పేరు అనూహ్యంగా ముందుకు వచ్చింది. అప్పటికే హరియాణ ఆరెస్సెస్ ప్రచారక్‌గా ఖట్టర్ పనిచేస్తున్నప్పటికీ పార్టీకి వెలుపల ఆయనెవరో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు పార్టీలోగానీ, ప్రభుత్వంలోగానీ ఆయన ఏ పదవిని నిర్వహించలేదు. సరాసరి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత నెల రోజులకే, అంటే 2014, నవంబర్ నెలలో ఆయన అసమర్థత మొదటిసారి బయట పడింది. హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న బాబా రాంపాల్‌ను అరెస్ట్ చేసి తీసుకరావాల్సిందిగా కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయడానికి పోలీసులు బర్వాలాలోని ఆయన ఆశ్రమానికి వెళ్లినప్పుడు భక్తులను అడ్డంపెట్టుకొని తప్పించుకునేందుకు బాబా రాంపాల్ ప్రయత్నించారు. అప్పుడు కూడా ఖట్టర్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. చివరకు రాంపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ జరిగిన ఘర్షణల్లో ఆరుగురు అమాయక భక్తులు మరణించారు. ఆ తర్వాత 2016లో ఉద్యోగ, విద్యారంగాల్లో తమకూ రిజర్వేషన్లు కల్పించాలంటూ జాట్లు చేసిన ఆందోళనను అరికట్టడంలోనూ మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం విఫలమైంది. హింసా, విధ్వంసకాండలో అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. సైన్యం రంగంలోకి దిగాకనే పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇప్పుడు రామ్ రహీమ్ సింగ్ అరెస్ట్ కారణంగా పంచకుల అంటుకోవడంతో కాంగ్రెస్, జాతీయ లోక్‌దళ్ పార్టీలు మనోహర్ రాజీనామాను డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ నేతలు కూడాడిమాండ్ చేస్తున్నారుగానీ వారు పేరు బహిర్గతం చేయడానికి ఇష్టం పడడం లేదు. ముఖ్యమంత్రి విధి నిర్వహణలో తన సలహాదారులు, సన్నిహిత ఆరెస్సెస్ నేతల సలహాలను తప్ప ఎవరి మాట వినిపించుకోరని బీజేపీ నేతలు వాపోతున్నరు. ఆరుసార్లు శాసన సభ్యుడిగా విజయం సాధించిన రామ్ విలాస్ శర్మ, నాలుగు సార్లు ఎన్నికైన అనుల్ విజ్ లాంటి అనుభవజ్ఞులను వదిలేసి మనోహర్‌ను ఎందుకు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారో అర్థం కావడం లేదని స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని 1996లో హర్యానా పార్టీ ఇంచార్జీగా పార్టీ అధిష్టానం పంపించినప్పుడు పంచకులలో మోదీకి బస ఏర్పాటు చేసినదీ, ఆయనతోపాటు బసలో ఉన్నది మనోహర్ లాల్ ఖట్టర్ అనే విషయం గుర్తొస్తే ఆయన నియామకం వెనక ఎవరి హస్తం ఉన్నదో ఊహించడం పెద్ద కష్టం కాదు. -
హరియాణా సీఎం రాజీనామా చేయాలి: సురవరం
హైదరాబాద్: హరియాణా హింసాత్మక ఘటనలపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) ఘాటుగా స్పందించింది. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తక్షణమేరాజీనామా చేయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హింసాత్మక ఘటనలను అదుపు చేయటంతో ఖట్టర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సురవరం ఆరోపించారు. ముఖ్యమంత్రిగా కొనసాగటానికి ఆయనకు ఎటువంటి అర్హత లేదని అన్నారు. జాట్ రిజర్వేషన్ ఉద్యమ సందర్భంలోనూ ఆయన ఇలాగే వైఫల్యం చెందారని విమర్శించారు. పంజాబ్, హరియాణాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసహనం పెరిగిపోయిందని అమాయకులపై దాడులు ఎక్కువయ్యాయని సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. -
ఖట్టర్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు
చంఢీగఢ్: లగ్జరీ హోటళ్లలో విదేశీయులకు సరఫరా చేసేందుకు గో మాంసాన్ని అనుమతిస్తామని, అందుకు ప్రత్యేక లెసైన్స్ విధానాన్ని తీసుకొస్తామంటూ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ మరో వివాదానికి తెర తీశారు. మానవులకు భిన్న రుచులు ఉంటాయని, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు గోమాంసం ఎక్కువగా తినే అలవాటు ఉంటుందని, అలాంటి వారి ఇష్టాయిష్టాలను ఎందుకు కాదనాలని, మద్యాన్ని నిషేధించిన గుజరాత్లో ప్రత్యేక అనుమతికింద విదేశీయులకు మద్యాన్ని అనుమతిస్తున్నప్పుడు తమ రాష్ట్రంలో మాత్రం గోమాంసాన్ని ఎందుకు అనుమతించరాదంటూ కూడా ఖట్టర్ మీడియా ముందు వ్యాఖ్యానించారు. గోవులను పవిత్ర జంతువుగా భావించే హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ కఠినమైన గోమాంస నిషేధ చట్టాన్ని తీసుకొచ్చిన బీజేపీ ముఖ్యమంత్రి ఖట్టర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినవా, ఇది ద్వంద్వ ప్రమాణాలను పాటించడం కాదా? అంటూ వివిధ వర్గాల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన నాలుక కరచుకున్నారు. ఇంకా ఈ విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశాన్ని ప్రభుత్వం అన్ని కోణాల నుంచి పరిశీలించాల్సిన అవసరం ఉందని ఖట్టర్‌కు ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్న జవహర్ యాదవ్ సోమవారం వివరణ ఇచ్చారు. భారత్‌లో నివసించాలంటే ముస్లింలు గోమాంసం తినడాన్ని మానుకోవాలని, తినాలనుకుంటే దేశం విడిచి వెళ్లాలంటూ ఖట్టర్ గతంలో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన విషయం తెల్సిందే. ఖట్టర్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం హర్యానాలో గోమాంసాన్ని ఎవరైనా విక్రయించినా, దాన్ని కొనుగోలు చేసినా, ఆహారంగా స్వీకరించినా లక్ష రూపాయల జరిమానా లేదా పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. కబేళాకు గోవులను తరలించిన వారికి 30 నుంచి 70 వేల వరకు జరిమానా లేదా మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.