ఖట్టర్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు
చంఢీగఢ్: లగ్జరీ హోటళ్లలో విదేశీయులకు సరఫరా చేసేందుకు గో మాంసాన్ని అనుమతిస్తామని, అందుకు ప్రత్యేక లెసైన్స్ విధానాన్ని తీసుకొస్తామంటూ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ మరో వివాదానికి తెర తీశారు. మానవులకు భిన్న రుచులు ఉంటాయని, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు గోమాంసం ఎక్కువగా తినే అలవాటు ఉంటుందని, అలాంటి వారి ఇష్టాయిష్టాలను ఎందుకు కాదనాలని, మద్యాన్ని నిషేధించిన గుజరాత్‌లో ప్రత్యేక అనుమతికింద విదేశీయులకు మద్యాన్ని అనుమతిస్తున్నప్పుడు తమ రాష్ట్రంలో మాత్రం గోమాంసాన్ని ఎందుకు అనుమతించరాదంటూ కూడా ఖట్టర్ మీడియా ముందు వ్యాఖ్యానించారు.
గోవులను పవిత్ర జంతువుగా భావించే హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ కఠినమైన గోమాంస నిషేధ చట్టాన్ని తీసుకొచ్చిన బీజేపీ ముఖ్యమంత్రి ఖట్టర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినవా, ఇది ద్వంద్వ ప్రమాణాలను పాటించడం కాదా? అంటూ వివిధ వర్గాల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన నాలుక కరచుకున్నారు. ఇంకా ఈ విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశాన్ని ప్రభుత్వం అన్ని కోణాల నుంచి పరిశీలించాల్సిన అవసరం ఉందని ఖట్టర్‌కు ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్న జవహర్ యాదవ్ సోమవారం వివరణ ఇచ్చారు.
భారత్‌లో నివసించాలంటే ముస్లింలు గోమాంసం తినడాన్ని మానుకోవాలని, తినాలనుకుంటే దేశం విడిచి వెళ్లాలంటూ ఖట్టర్ గతంలో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన విషయం తెల్సిందే. ఖట్టర్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం హర్యానాలో గోమాంసాన్ని ఎవరైనా విక్రయించినా, దాన్ని కొనుగోలు చేసినా, ఆహారంగా స్వీకరించినా లక్ష రూపాయల జరిమానా లేదా పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. కబేళాకు గోవులను తరలించిన వారికి 30 నుంచి 70 వేల వరకు జరిమానా లేదా మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.