బెంబేలెత్తిన చైనా.. ఆ భేటీ వెనుక మర్మమిదే!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను భయపెట్టేందుకు రెండురోజుల కిందట ఇమ్రాన్‌ఖాన్ తన పార్టీ ఫేస్‌బుక్ పేజీలో పెట్టిన ఓ వీడియో.. షరీఫ్ కన్నా ఎక్కువగా మరొకరిని భయపెట్టినట్టు కనిపిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ జిమ్‌లో భారీగా కసరత్తులు చేస్తూ.. ఇక నవాజ్ షరీఫ్ భయపడక తప్పదంటూ వీడియో తీసి.. దానిని పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఫేస్‌బుక్ పేజీలో పెట్టారు.
షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నవంబర్ 2న ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ ‘ఆక్యుపై ఇస్లామాబాద్’ (ఇస్లామాబాద్ ముట్టడి) పేరిట భారీ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళన కోసం భారీ సన్నాహాలు చేస్తున్నామనే హెచ్చరికలు జారీచేసేందుకు ఆయన ఈ కసరత్తుల వీడియోను ఫేస్‌బుక్‌లో పెట్టారు.
కానీ ఈ వీడియో షరీఫ్ కన్నా ఎక్కువగా చైనాను బెంబేలెత్తించినట్టు కనిపిస్తోంది. ఈ వీడియోతో భయాందోళన చెందిన చైనా రాయబారి మంగళవారం అనూహ్యంగా ప్రతిపక్ష నేత ఇమ్రాన్‌ఖాన్‌తో భేటీ అయ్యారు. ప్రధాని షరీఫ్‌కు వ్యతిరేకంగా చేపడుతున్న ర్యాలీలో పాక్‌లోని చైనా పెట్టుబడులను లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయవద్దని, ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 51 బిలియన్ డాలర్ల చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ పై వ్యతిరేక విమర్శలు చేయవద్దని చైనా రాయబారి ఇమ్రాన్‌ను కోరినట్టు పాక్ మీడియా బుధవారం తెలిపింది.
తన కుటుంబసభ్యులు విదేశాల్లో నల్లధనం దాచుకున్నారని పనామా పత్రాల్లో వెల్లడైనా ప్రధాని నవాజ్ షరీఫ్ బాధ్యత వహించకపోవడం, కశ్మీర్ విషయంలో ఆయన నిష్క్రియాపరత్వాన్ని ఎండగడుతూ ప్రతిపక్ష పీటీఐ, ఆ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ నవంబర్ 2న ఇస్లామాబాద్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఆ రోజున రాజధానిని పూర్తిగా స్తంభింపజేసి తమ సత్తా చాటుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పాక్‌లోని చైనా రాయబారి సున్ వీడాంగ్ స్వయంగా ఇమ్రాన్ ఖాన్‌తో భేటీకి విజ్ఞప్తి చేశారని పీటీఐ వర్గాలు మీడియాకు తెలిపాయి. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)కి ఇమ్రాన్ ఖాన్ మద్దతు కూడగట్టడానికి, ఈ ప్రాజెక్ట్‌కు ఆయన వ్యతిరేకమన్న వదంతులను దూరం చేసేందుకు ఈ భేటీ జరిగినట్టు పాక్ మీడియా తెలిపింది. పాకిస్థాన్‌కు చైనా అందిస్తున్న మద్దతును ఇమ్రాన్‌ఖాన్ ప్రశంసించారని, సీపీఈసీ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకం ఉండబోదని ఆయన చైనా రాయబారికి భరోసా ఇచ్చారని, ఈ ప్రాజెక్టు పాకిస్థాన్ తలరాతను మార్చివేస్తుందని ఆయన పేర్కొన్నట్టు పీటీఐ వర్గాలు తెలిపాయి.