కార్డు ఉండగా... రూపాయి ఎందుకు!
అధికారంలోకొచ్చే వరకు ఆస్తులమ్మి అయినా సరే పార్టీకి సేవ చేయండని చెప్పిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు తనకు జేబులో రూపాయి కూడా లేదని చెప్పడంపై నేతలంతా నివ్వెరపోతున్నారు. నష్టపోయింది మేమైతే...! ఆయన జేబులో చిల్లి గవ్వ లేదని ఎలా చెబుతారని ఖర్చుపెట్టుకుని దిగాలుగా ఉన్న నేతలు ప్రశ్నిస్తున్నారు. జేబులో రూపాయి లేదు...! చేతికి వాచీ లేదు...!! అని ఇటీవల విజయవాడ సమావేశంలో ఒక నాయకుడు సానుభూతి పలుకులు పలికారు. దాంతో పక్కనున్న నేత మండిపడుతూ రూపాయితో పనేంటి? జేబులో సింగపూర్ కార్డులు ఉండగా...!
చెబితే కొంచెం నమ్మశక్యంగా ఉండాలి.. అంటూ ఫైరయ్యారట. ఏది చెబితే అది జనం నమ్ముతారనుకుంటే ఎలా? సంతకం చేయడానికి ఆయన వాడుతున్న పెన్ను ఖరీదెంతో తెలుసా...? మాంట్‌బ్లాంక్... 60 వేల రూపాయలు...! అంటూ రుసరుసలాడారట. దాని ధర మీకెలా తెలుసని అమాయకంగా అడిగిన మరొకాయనకు...! అదిగో (ముందు వరుసలో ఉన్న ఒకాయనను చూపిస్తూ...) ఆయనే అమెరికా నుంచి తెచ్చి గిఫ్ట్‌గా ఇచ్చారని చెప్పారట. ఏదడిగినా ఇచ్చేవాళ్లు (బినామీలు) పక్కనుంటే...! జేబులో రూపాయెందుకు దండగ...!! అంటూ అక్కడినుంచి నిష్ర్కమించారు.