అర్ధరాత్రి వేళల్లో ఆత్మహత్యలే అధికం!
న్యూయార్క్: మనిషి తన జీవి తాన్ని అంతం చేసుకోవాలనే విపరీతమైన ప్రవర్తన కలిగి ఉండటాన్ని వైద్యపరిభాషలో పారా సూసైడ్ అంటారు. సాధారణ పరిభాషలో ఆత్మహత్య ధోరణి(సూసైడల్ టెండెన్సీ ) అంటారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన, దానికోసం చేసే ప్రయత్నాలు ఈ రెండూ కూడా మానసిక వ్యాధుల కోవలోకే వస్తాయి. అసలు ఆత్మహత్యలు అధికం కావడానికి మాత్రం ప్రధాన కారణం నిద్రలేమి సమస్యలేనని తాజా సర్వేలో వెల్లడైంది. దీనిపై ఫిలాడెల్ఫియాలోని పెన్సిల్వేనియా యూనివర్శిటీ ఒక పరిశోధన నిర్వహించిది. ఇందుకు గాను ఆత్మహత్య చేసుకున్న 35,332 మంది జీవితాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఇందులో అర్ధరాత్రి తర్వాత 10.27 శాతం మంది ఆత్మహత్యలు చేసుకోగా, రెండు గంటలు, ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న వారి శాతం 16.27 గా నమోదైంది. ఇదిలా ఉండగా ఉదయం 6 గం.ల నుంచి 11గం.ల ప్రాంతంలో మాత్రం 2.3 శాతంగా ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. దీనికి కారణం మాత్రం అర్ధరాత్రి పూట పార్టీలకు హాజరై తగినంత నిద్ర లేకపోవడమేనని యూనివర్శిటీ ప్రొఫెసర్ మైఖేల్ పెర్లిస్ స్పష్టం చేశారు. నిద్రలేమి సమస్య కారణంగానే రాత్రి వేళల్లో ఆత్మహత్యలు అధికమవడానికి ప్రధాన కారణమని స్పష్టం చేశారు.