
ఆ సెల్ ఫోన్లు ఎందుకు సీజ్ చేయలేదు?
న్యూఢిల్లీ: హర్యానాలోని జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఎంబీఏ విద్యార్థినిపై సీనియర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి 21 ఏళ్ల విద్యార్థినిపై సీనియర్, అతడి స్నేహితులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఏడాదిన్నరపైగా జరిగిన ఈ దారుణోదంతం వెలుగు చూసింది.
ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని న్యాయస్థానికి బాధితురాలు మొరపెట్టుకుంది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. స్టేటస్ నివేదిక సమర్పించాలని హర్యానా పోలీసులను ఆదేశించింది. నిందితులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. తన ఫోటోలు బయటపెడతారన్న భయంతోనే ఇన్నాళ్లు ఫిర్యాదు చేయలేదని తెలిపింది.
ఇది సీరియస్ కేసు అని, నిందితుల సెల్ ఫోన్లు ఎందుకు సీజ్ చేయలేదని హర్యానా పోలీసులను జస్టిస్ ఏకే సిక్కి, జస్టిస్ యుయు లలిత్ లతో కూడిన బెంచ్ ప్రశించింది. వెంటనే స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది.