
సహాయ బృందాలకు బదులు టాస్క్‌ఫోర్సా?: రోజా
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి రోజా ఆక్షేపణ
సాక్షి, హైదరాబాద్: జలవిలయంతో రాష్ట్రంలోని 3 ప్రాంతాలూ తీవ్రంగా నష్టపోతే కేంద్రం సహాయక బృందాలను పంపడం మాని.. రాష్ట్రాన్ని నిలువునా చీల్చడానికి టాస్క్‌ఫోర్స్‌ను పంపడమేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆర్‌కే రోజా ఆక్షేపించారు. రాష్ట్రాన్ని బలివ్వడానికి ఆంటోనీ కమిటీ, మంత్రుల బృందం, టాస్క్‌ఫోర్స్‌ల పేరిట కత్తులు దూస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 65 శాతం మంది ప్రజలు 80 రోజులకు పైగా ఉద్యమిస్తున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోకపోవడం దుర్మార్గమని రోజా పేర్కొన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేందుకు కేంద్రం రోజుకో కమిటీ వేస్తూ, రోజుకో ప్రకటన చేస్తోందని మండిపడ్డారు.
మంగళవారం ఇక్కడ రోజా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మన రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ కక్షగట్టిందని దుయ్యబట్టారు. సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్న తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై బురద చల్లడమే కాంగ్రెస్, టీడీపీలు పనిగా పెట్టుకున్నాయని రోజా విమర్శించారు. చంద్రబాబు ‘చెంబుగ్యాంగ్’ పొద్దున లేచింది మొదలు జగన్‌పై బురద చల్లడం, వారి భజన చానళ్లు ప్రసారం చేయడం, వాటినే కాంగ్రెస్ నేతలు వల్లె వేయడం.. అంతా ఒక పథకం ప్రకారం ఒకరి మనసులోని భావాలను మరొకరు వ్యక్తపరుస్తున్నారని ధ్వజమెత్తారు.
సమైక్య శంఖారావం సభకు రూ.200 కోట్లు ఖర్చు చేశారని టీడీపీ నేత సోమిరెడ్డి చెబుతున్న మాటలు చూస్తుంటే... పచ్చకామెర్లు వచ్చిన రోగికి లోకమంతా పచ్చగా కనబడినట్లుందని రోజా ఎద్దేవా చేశారు. వారు నిర్వహించే సభలకు అలాగే ఖర్చు చేస్తున్నట్లున్నారని, అందుకే అదే ఆలోచనతో మాట్లాడుతున్నట్లుందని అన్నారు. టీడీపీ వరుసగా రెండుసార్లు అధికారం కోల్పోవడంతో చంద్రబాబుకు మతితప్పినట్లు ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఏ ఒక్క రోజూ రైతుల గురించి ఆలోచించిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ నాయకుడు జేసీ దివాకర్‌రెడ్డిని వైస్సార్‌సీపీలోకి చేర్చుకోవడం లేదనే అక్కసుతోనే జగన్‌మోహన్‌రెడ్డిపై ఆయన బురద చల్లుతున్నారని రోజా అన్నారు. దివాకర్‌రెడ్డి తన బంధువుల ద్వారా రాయబారం పంపితే జగన్ తిరస్కరించినట్లు ఆమె వెల్లడించారు. ఆ తర్వాత తమ్ముడు ప్రభాకర్‌రెడ్డికి టీడీపీ ఎంపీ టిక్కెటు, తన కుమారుడికి ఎమ్మెల్యే టిక్కెటు ఖాయం కావడంతో జేసీ వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.