భవిష్యత్తులోకూడా ఎల్వోసీని దాటుతాం: భారత్
న్యూఢిల్లీ: ఉడీ దాడి తర్వాత భారత్ ఉడీకి ముందు భారత్ అని ప్రపంచదేశాలు చెప్పుకునే స్ధాయికి ఇండియా చేరుకుంటోందా?. తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాలు దీన్నే సూచిస్తున్నాయి. వరుస ఉగ్రదాడులతో దేశం నెత్తురోడుతున్నా ఎన్నడూ సంప్రదింపుల గీతను దాటని భారత్ నిర్దేశిత దాడులతో పాకిస్తాన్ కు గట్టిగా బదులిచ్చింది.
ఈ మేరకు భారత్ లోకి ఉగ్రవాదులను పంపే ఆలోచనను మానుకోకపోతే నియంత్రణ రేఖా(ఎల్వోసీ)నిబంధనల ఉల్లంఘనకు భారత్ ఏ మాత్రం వెనుకాడదని కేంద్ర ప్రభుత్వం పాక్ కు చెప్పినట్లు సమాచారం. నియంత్రణ రేఖ నుంచి ఉగ్రవాదులు చొరబడుతున్నారనే సమాచారం ఉన్నా, స్ధావరాలు ఏర్పాటు చేసుకున్నారని తెలిసినా ముందస్తు చర్యగా కూడా ఎల్వోసీ నిబంధనలను ఉల్లంఘించడానికి సిద్ధంగా ఉన్నట్లు పాక్ ను హెచ్చరించింది.
2004 జనవరి 6న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారాఫ్ తమ ఆధీనంలో ఉన్న భూభాగం నుంచి భారత్ పై ఉగ్రదాడులను ప్రోత్సహించమనే ఒప్పందంపై సంతకం చేశారు. అయినా సంవత్సరాలుగా పాక్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నా భారత్ మాత్రం ఓపికగా సంప్రదింపులు జరుపుతూనే వచ్చింది. ఉడీ ఉగ్రదాడి తర్వాత తొలిసారి ప్రతిఘటించిన భారత్ ఎల్వోసీ ఆవల ఉగ్రస్ధావరాలపై నిర్దేశిత దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో పాకిస్తాన్ ఒక్కసారిగా షాక్ కు గురైంది.
నిర్దేశిత దాడుల అనంతరం నియంత్రణ రేఖ వెంబడి ప్రతీకారం కోసం పాక్ ఆర్మీ చేసిన చొరబాటు ప్రయత్నాలను భారత్ తిప్పికొట్టింది. ఈ విషయంపై పాక్ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) నసీర్ జంజువాతో సమావేశమైన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ లు ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని అన్నారు. తమ ఓపికను నిస్సహాయత పాక్ భావిస్తే అది వారి తప్పని తెలుసుకునేలా చేస్తామని భారత్ పాక్ కు చెప్పినట్లు తెలిసింది.
కానీ ప్రతీకార దాడుల కోసం పాక్ ప్రయత్నిస్తున్నట్లు భారత ఇంటిలిజెన్స్ కు సమాచారం ఉంటోంది. అంతేకాకుండా భారత్-పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న పరిస్ధితులు సద్దుమణుగుతాయా? లేదా? అన్న విషయం తెలియాలంటే నవంబర్ లో పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ రిటైరవుతారా? పదవీకాలాన్ని పొడగిస్తారా? అనే దానిపై ఆధాపడి ఉంటుంది.