breach
-
పార్లమెంట్ అలజడి ఘటన.. నిందితులకు మానసిక పరీక్షలు
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో నిందితులను మానసిక పరీక్షలు(సైకో ఎనాలసిస్) నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలతో పార్లమెంట్ అలజడి ఘటనకు పాల్పడటానికి నిందితుల అసలు ఉద్దేశం తెలుసుకునే అవకాశం ఉంటుంది. గురువారం ఒక నిందితున్ని ఫోరెన్సిక్ సైన్స్ లాబెరేటరీకి తీసుకెళ్లారు. ఒక్కొక్కర్ని ఈ పరీక్షలకు తీసుకెళ్లనున్నారు. సైకో ఎనాలసిస్ పరీక్షల్లో నిందితుల అలవాట్లు, నిత్య జీవణ శైలి, స్వభావం తదితరాలు తెలుసుకుంటారు. సైక్రియాట్రిస్ట్ ప్రశ్న-జవాబుల విధానంలోనే ఈ టెస్ట్ ఉంటుంది. ఇచ్చిన జవాబుల ఆధారంగా నిందితుల వెనక ఉన్న అసలు ఉద్దేశాలను వైద్యులు అంచనా వేస్తారు. ఈ పరీక్షలు దాదాపు మూడు గంటలపాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరుపుతారు. శ్రద్ధా వాకర్ మర్డర్ కేసు, షహ్బాద్ డైరీ మర్డర్ కేసుల్లో నిందితులపై పోలీసులు ఇలాంటి పరీక్షలను నిర్వహించారు. డిసెంబర్ 13న పార్లమెంట్‌లోకి నలుగురు ఆగంతకులు ప్రవేేశించారు. ఇద్దరు లోక్‌సభ లోపల గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో గ్యాస్ బాంబులను ప్రయోగించారు. దీంతో పార్లమెంట్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అంశంతో పార్లమెంట్ భద్రతా విధులను ఢిల్లీ పోలీసుల నుంచి కేంద్ర బలగాలకు బదిలీ చేశారు. ఇదీ చదవండి: పార్లమెంట్లో మరో ముగ్గురు ఎంపీల సస్పెండ్.. మొత్తం 146 మంది -
'తప్పుదోవ పట్టించారు..' నిందితుడు సాగర్ శర్మ తల్లి ఆవేదన
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనపై నిందితుడు సాగర్ శర్మ తల్లి స్పందించారు. ఈ ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. తన కుమారుడు అమాయకుడని, తప్పుదోవ పట్టించి, కుట్రలో ఇరుకించారని ఆరోపించారు. సాగర్ దేశ భక్తి గల వ్యక్తి అని చెప్పారు. 'స్నేహితున్ని కలవడానికి ఢిల్లీకి వెళుతున్నట్లు చెప్పాడు. రెండ్రోజుల్లో వస్తానని అన్నాడు. నా కొడుకుని ఎవరో కుట్రలో ఇరికించారు. ఆటో నడిపేవాడు. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడే నా ఆధారం. ప్రతి రోజు దాదాపు రూ.500 వరకు సంపాదించేవాడు. చాలా అమాయకుడు. మంచి వ్యక్తిత్వం గలవాడు. దేశం పట్ల ఎప్పుడు భక్తిభావంతో ఉండేవాడు. ఇలాంటి పనులు ఎప్పుడు చేయడు. ఎవరో అతనికి ఇవన్నీ నూరిపోశారు. కుట్రలో ఇరికించారు.' అని సాగర్ తల్లి రాణి శర్మ అన్నారు. కేసులో నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని సాగర్ సోదరి మహి శర్మ కోరారు. తన సోదరున్ని ఈ కేసులో ఇరికించిన వారిని కఠినంగా శిక్షించాలి అని ప్రధాని మోదీకి విన్నవించారు.' నా సోదరుడు ఇంటర్ వరకు చదువుకున్నాడు. మంచి దేశ భక్తుడు. దేశ అభివృద్ధి గురించి మాట్లాడేవాడు. ఆగష్టు 15కు ఆటోపై మూడు రంగుల జెండా పెట్టుకునేవాడు' అని సాగర్ సోదరి మహి శర్మ తెలిపింది. Parliament intruder's mother and sister claim his innocence, says he is getting framed, appeals for fair probe Read @ANI Story | https://t.co/A0OYCYyaoa#Parliament #SecurityBreach #Intruders pic.twitter.com/veM1JR1iNv — ANI Digital (@ani_digital) December 14, 2023 అయితే.. నిందితులందరూ సోషల్ మీడియా పేజీ 'భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్'తో సంబంధం కలిగి ఉన్నారని పోలీసులు తెలిపారు. ఏడాదిన్నర క్రితం అందరూ మైసూరులో కలిశారు. సాగర్ జూలైలోనే లక్నో నుంచి వచ్చాడు.. కానీ పార్లమెంట్ హౌజ్ లోపలికి వెళ్లలేకపోయాడు. డిసెంబర్ 10 నుంచి నిందితులందరూ ఒక్కొక్కరిగా ఢిల్లీకి చేరుకున్నారు. ఇండియా గేట్ వద్ద గ్యాస్ క్యానిస్టర్లను పంచుకున్నారని పోలీసులు గుర్తించారు. లక్నోలోని మానక్నగర్ ప్రాంతంలో సాగర్ శర్మ నివాసం ఉంటున్నాడు. వామపక్ష భావాజాలంతో ఫేస్బుక్ పోస్టులు చేస్తుండేవాడని పోలీసులు గుర్తించారు. కోల్‌కతా, హర్యానా, రాజస్థాన్‌కు చెందిన చాలా మందితో సాగర్ శర్మకు సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా ఆయన ఫేస్బుక్ పేజీలో యాక్టివ్‌గా లేరని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా నుంచి లక్నోకు వలస వచ్చిన సాగర్ కుటుంబం.. ఇక్కడే గత 20 ఏళ్ల నుంచి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. తండ్రి, తల్లి, సోదరితో సాగర్ ఉంటున్నాడని పోలీసులు వెల్లడించారు. ఇదీ చదవండి: Parliament: గ్యాస్ క్యానిస్టర్లు అంటే ఏంటి? ఎక్కడైనా వాడొచ్చా? -
నిందితుల ఎంట్రీ పాస్‌లపై ఎంపీ ప్రతాప్ సింహ వివరణ
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనలో నిందితులు కర్ణాటక ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం నుంచి విజిటర్ పాస్‌లను పొందారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లాను ప్రతాప్ సింహ నేడు కలిశారు. నిందితులకు పాస్‌లను ఇవ్వడానికి గల కారణాన్ని ఆయన వివరించారు. పార్లమెంట్ విజిటర్ పాస్ కోసం నిందితుల్లో ఒకరి తండ్రి తన కార్యాలయానికి వచ్చారని స్పీకర్‌కు తెలిపారు. పాస్‌ల కోసం నిందితుడు సాగర్ శర్మ నిరంతరం తన పీఏకి టచ్‌లోనే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంతకు మించిన సమాచారం తన వద్ద లేదని స్పీకర్‌కు వివరించినట్లు సమాచారం. మనోరంజన్, సాగర్ శర్మ, నీలమ్, అమోల్ శిందె, విశాల్, లలిత్ అనే ఆరుగురు దుండగులు ఈ ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో మనోరంజన్, సాగర్‌శర్మ లోక్‌సభలోకి చొరబడగా.. నీలమ్, అమోల్ శిందే పార్లమెంట్ భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితో పాటు వీరికి సహకరించిన విశాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా లలిత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పార్లమెంట్లో బుధవారం గందరగోళం నెలకొంది. పక్కా ప్రణాళికతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన నిందితులు గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు నిందితులు లోక్‌సభ లోపలికి ప్రవేశించి పసుపు రంగు గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో ఎంపీలంతా భయాందోళనకు గురయ్యారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి జరిగిన రోజే మళ్లీ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదీ చదవండి: Parliament: గ్యాస్ క్యానిస్టర్లు అంటే ఏంటి? ఎక్కడైనా వాడొచ్చా? -
ప్రధాని మోదీ భద్రతా వలయంలో కలకలం
లక్నో: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా వలయంలో కలకలం రేగింది. ఉద్యోగం కావాలంటూ ఓ యువకుడు ప్రధాని మోదీ కాన్వాయ్ ముందు దూకాడు. ప్రధాని మోదీ కాన్వాయ్ లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయానికి వెళ్తుండగా రుద్రాక్ష సెంటర్ వెలుపల ఈ ఘటన జరిగింది. The man has been identified as a #BJP worker and has been held. He was just 10 feet away from the #PMModi's car after he jumped. Police and security officials immediately caught him. @AbshkMishra https://t.co/wvrQvG1N2V — IndiaToday (@IndiaToday) September 23, 2023 ప్రధాని నరేంద్ర మోదీ నిన్న వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని తిరుగుప్రయాణంలో ఓ యువకుడు ప్రధాని మోదీ కాన్వాయ్ భద్రతా వలయాన్ని చీల్చుకుని లోపలికి వెళ్లాడు. ఉద్యోగం కావాలంటూ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టాడు. గుర్తించిన పోలీసులు.. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదీకి కేవలం 20 మీటర్ల దూరంలోనే ఉన్నాడని పోలీసులు చెప్పారు. నిందితున్ని ఘాజీపూర్‌కు చెందిన కృష్ణ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అయితే.. ప్రధాని మోదీ భూమి పూజ చేసిన క్రికెట్ స్టేడియా 2025 డిసెంబర్ నాటికి పూర్తికానుంది. యూపీలో కాన్సూర్, లక్నో తర్వాత వారణాసిలో నిర్మించేదానితో మూడో క్రికెట్ స్టేడియం కానుంది. ఇదీ చదవండి: అధికారంలోకి వస్తే బిల్లును సవరిస్తాం: ఖర్గే -
బైడెన్ డ్రైవర్ నిర్బంధం.. ఎందుకంటే..?
ఢిల్లీ: జీ20 సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కారు డ్రైవర్‌ను సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా కారు డ్రైవింగ్ చేసినందుకు బైడెన్ కాన్వాయ్ నుంచి అతన్ని తొలగించారు. ప్రోటోకాల్‌కు విరుద్ధంగా కారును నడిపినందుకు సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అధ్యక్షుడు బైడెన్ కాన్వాయ్‌లో ఓ కారు డ్రైవర్ తన కారును యూఏఈ అధ్యక్షుడు నివాసముండే తాజ్ హోటల్‌కు తీసుకువెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ విభాగం అధికారులకు సమాచారం అందించారు. ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాను ఉదయం 9:30కి బైడెన్ నివాసముండే మౌర్య హోటల్‌కు వెళ్లాల్సి ఉందని డ్రైవర్ చెప్పాడు. ఈ క్రమంలో లోధి ఎస్టేట్ వద్ద నుంచి ఓ బిజినెస్ మ్యాన్‌ను తాజ్ వద్ద దించాల్సి వచ్చిందని చెప్పాడు. తనకు ప్రోటోకాల్స్ గురించి తెలియదని చెప్పాడు. దీంతో ఆ డ్రైవర్‌ను వదిలేశారు. జీ20 మీటింగ్‌కు హాజరవడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ శుక్రవారం ఢిల్లీ వచ్చారు. శనివారం ఉదయం నుంచి ప్రారంభమైన సమావేశాల్లో పాల్గొన్నారు. అనంతరం శనివారం రాత్రి డిన్నర్ మీటింగ్‌కి హజరయ్యారు. ఈ రోజు ఉదయం రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. కొద్ది క్షణాల ముందే ఢిల్లీ నుంచి తిరుగుప్రయాణమయ్యారు. ఇటు నుంచి నేరుగా వియత్నాంకు బయలుదేరారు. ఇదీ చదవండి: ఢిల్లీ డిక్లరేషన్ వెనక షేర్పాల కఠోర శ్రమ -
టెక్ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్: కేంద్ర ఐటీ మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్‌కు భారత్ భారీ షాక్ ఇవ్వనుందా? అంటే అవుననే సంకేతాలు తాజాగా వెలు వడ్డాయి. యాంటిట్రస్ట్ ఉల్లంఘనపై గూగుల్‌పై భారత్ చర్య తీసుకుంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్లో కంపెనీ తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందన్న రెండు కేసుల్లో గూగుల్‌కి ఇటీవల 275 మిలియన్ డాలర్ల పెనాల్టీ నేపథ్యంతో తాజా వ్యాఖ్యాలు చేశారు. (Jr. NTR Net Worth: ఖరీదైన కార్లు, లగ్జరీ వాచెస్, ఫ్యాన్స్ ఖుషీ!) గూగుల్‌పై ప్రభుత్వం చర్య తీసుకోవాలి తన మార్కెట్ స్థానాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా పోటీ వ్యతిరేక పద్ధతులకు పాల్పడుతున్న ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్‌పై ప్రభుత్వం చర్య తీసుకోవాలని యోచిస్తున్నట్లు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు. గూగుల్‌పై ఇటీవలి జరిమానా తీవ్రమైందని, ఇది మరింత ఆందోళన కలిగిస్తోందని మంత్రి రాయిటర్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే గూగుల్‌పై ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ చర్య తీసుకోబోతోందో వెల్లడించేందుకు మంత్రి నిరాకరించారు. ఈ సమస్య మనకే కాదు, భారతదేశంలోని మొత్తం డిజిటల్ పర్యావరణ వ్యవస్థకు ఆందోళన కలిగిస్తోంద న్నారు. దీనిపై ఇప్పటివరకు గూగుల్‌తో ప్రభుత్వం చర్చించ లేదని, ఈ విషయంలో కోర్టులో ఉంది కనుక ఎలాంటి చర్చ అవసరం లేదని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?) కాగా ప్రపంచంలో గూగుల్‌కి రెండో అతిపెద్ద మార్కెట్ భారత్‌లో అక్రమాలకు పాల్పడుతుందన్న ఆరోపణలు నిజమని గత ఏడాది యాంటీట్రస్ట్ వాచ్డాగ్ సీసీఐ తేల్చింది. కాంపిటీషన్ యాక్ట్, 2002ను అమలు చేయడానికి ఏర్పాటైన చట్టబద్ధమైన భారత ప్రభుత్వ సంస్థ. వ్యాపారంలో పోటీ కార్యకలాపాల్లో అవినీతి, అవకతవకలు నిర్ధారణ అయితే భారీ జరిమానాలు విధించే అధికారం సీసీఐకి ఉన్న సంగతి తెలిసిందే. -
రాహుల్ భారత్ జోడో యాత్రలో భద్రతా వైఫల్యం
-
భవిష్యత్తులోకూడా ఎల్వోసీని దాటుతాం: భారత్
న్యూఢిల్లీ: ఉడీ దాడి తర్వాత భారత్ ఉడీకి ముందు భారత్ అని ప్రపంచదేశాలు చెప్పుకునే స్ధాయికి ఇండియా చేరుకుంటోందా?. తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాలు దీన్నే సూచిస్తున్నాయి. వరుస ఉగ్రదాడులతో దేశం నెత్తురోడుతున్నా ఎన్నడూ సంప్రదింపుల గీతను దాటని భారత్ నిర్దేశిత దాడులతో పాకిస్తాన్ కు గట్టిగా బదులిచ్చింది. ఈ మేరకు భారత్ లోకి ఉగ్రవాదులను పంపే ఆలోచనను మానుకోకపోతే నియంత్రణ రేఖా(ఎల్వోసీ)నిబంధనల ఉల్లంఘనకు భారత్ ఏ మాత్రం వెనుకాడదని కేంద్ర ప్రభుత్వం పాక్ కు చెప్పినట్లు సమాచారం. నియంత్రణ రేఖ నుంచి ఉగ్రవాదులు చొరబడుతున్నారనే సమాచారం ఉన్నా, స్ధావరాలు ఏర్పాటు చేసుకున్నారని తెలిసినా ముందస్తు చర్యగా కూడా ఎల్వోసీ నిబంధనలను ఉల్లంఘించడానికి సిద్ధంగా ఉన్నట్లు పాక్ ను హెచ్చరించింది. 2004 జనవరి 6న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారాఫ్ తమ ఆధీనంలో ఉన్న భూభాగం నుంచి భారత్ పై ఉగ్రదాడులను ప్రోత్సహించమనే ఒప్పందంపై సంతకం చేశారు. అయినా సంవత్సరాలుగా పాక్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నా భారత్ మాత్రం ఓపికగా సంప్రదింపులు జరుపుతూనే వచ్చింది. ఉడీ ఉగ్రదాడి తర్వాత తొలిసారి ప్రతిఘటించిన భారత్ ఎల్వోసీ ఆవల ఉగ్రస్ధావరాలపై నిర్దేశిత దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో పాకిస్తాన్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. నిర్దేశిత దాడుల అనంతరం నియంత్రణ రేఖ వెంబడి ప్రతీకారం కోసం పాక్ ఆర్మీ చేసిన చొరబాటు ప్రయత్నాలను భారత్ తిప్పికొట్టింది. ఈ విషయంపై పాక్ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) నసీర్ జంజువాతో సమావేశమైన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ లు ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని అన్నారు. తమ ఓపికను నిస్సహాయత పాక్ భావిస్తే అది వారి తప్పని తెలుసుకునేలా చేస్తామని భారత్ పాక్ కు చెప్పినట్లు తెలిసింది. కానీ ప్రతీకార దాడుల కోసం పాక్ ప్రయత్నిస్తున్నట్లు భారత ఇంటిలిజెన్స్ కు సమాచారం ఉంటోంది. అంతేకాకుండా భారత్-పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న పరిస్ధితులు సద్దుమణుగుతాయా? లేదా? అన్న విషయం తెలియాలంటే నవంబర్ లో పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ రిటైరవుతారా? పదవీకాలాన్ని పొడగిస్తారా? అనే దానిపై ఆధాపడి ఉంటుంది. -
రాంగ్ రూట్‌పై నజర్
ఆధునిక టెక్నాలజీ వినియోగించనున్న ట్రాఫిక్ కాప్స్ నగరంలో 100 చోట్ల కెమెరాల ఏర్పాటు ‘ఉల్లంఘనులకు’ జనవరి నుంచి ఈ-చలాన్లు ‘తొంబై తొమ్మిది సార్లు ఉల్లంఘించినా ఏ ఇబ్బందీ రాకపోవచ్చు... వందోసారైనా మూల్యం చెల్లించక తప్పదు’ ట్రాఫిక్ ఉల్లంఘనల విషయంలో అధికారులు పదేపదే చెప్పే మాట ఇది. ఈ మూల్యం ఉల్లంఘనకు పాల్పడిన వాహనచోదకుడు చెల్లిస్తే ఒక ఎత్తు. అదే... ఏ పాపం ఎరుగని ఎదుటి వ్యక్తిపై ప్రభావం చూపితే... ఆ కుటుంబం బాధ, వ్యధ వర్ణనాతీతం. ప్రస్తుతం నగరంలో నిత్యం అనేక కుటుంబాలు ఈ క్షోభను అనుభవిస్తున్నాయి. ఉల్లంఘనులు ‘పొరపాటుగా’ అని భావించే అనేక అంశాలు బాధితుల పాలిటి గ్రహపాటుగా మారుతున్నాయి. ఇలాంటి ‘పొరపాట్ల’లో రాంగ్ రూట్..., నో ఎంట్రీ మార్గాల్లోకి వాహనాలతో రావడం ప్రధానమైంది. నిర్లక్ష్యంతో కూలిపోతున్న కుటుంబాలు.. నగరంలో ఇలా రాంగ్ రూట్/నో ఎంట్రీ మార్గాల్లో దూసుకుపోతూ ప్రమాదాలకు గురికావడంతో పాటు వాటికి కారకులుగా మారుతున్న ఉదంతాలు ఎన్నో ఉంటున్నాయి. కాస్తదూరం ముందుకు వెళ్లి ‘యూ టర్న్’ తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్న వాహనచోదకులు... అది వన్ వే అని ... రాంగ్ రూట్ అని తెలిసి కూడా దూసుకుపోతున్నారు. నో ఎంట్రీ మార్గాలనూ వీరు వదలట్లేదు. ఇలాంటి వాహనచోదకులు నిత్యం చిన్న చిన్న ప్రమాదాలకు లోనవడంతో పాటు కారకులవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఎదుటి వారి ఉసురు తీసి వారి కుటుంబాన్నే కకలావికలం చేస్తున్నారు. 2013లో జరిగిన ముషీరాబాద్ ఏఎస్సై సత్యనారాయణ మరణమే దీనికి నిదర్శనం. ఇప్పటి వరకు బారికేడ్లు, కెమెరాలతో... సిటీలోని అనేక జంక్షన్లతో పాటు కొన్ని కీలక ప్రాంతాల్లో ఈ రాంగ్ రూట్, నో ఎంట్రీ ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆయా చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసినా ఉల్లంఘనుల్ని అడ్డుకోలేకపోతున్నారు. దీంతో కెమెరాలతో కానిస్టేబుళ్లు, హోంగార్డుల్ని మోహరిస్తున్నారు. వీరు ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడే వారి వాహనాలను ఫొటోలు తీసి, ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఈ-చలాన్ పంపుతున్నారు. అయితే అన్ని వేళల్లో, ప్రధానంగా రాత్రిపూట ఈ పాయింట్లలో సిబ్బంది లేకపోవడంతో ఉల్లంఘనులు రెచ్చిపోయి తమ ప్రాణాలు పోగొట్టుకోవడం లేదా ఇతరుల ప్రాణాలు తీయడం చేస్తున్నారు. దీనికి పరిష్కారంగానే ట్రాఫిక్ పోలీసు విభాగం ఏఆర్‌డీవీసీఎస్ పరిజ్ఞానాన్ని అమలులోకి తెస్తోంది. వచ్చే నెల నుంచి అందుబాటులోకి... ఈ తరహా ఈ-చలాన్లు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచేసే వాహనచోదకులపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రెండు కమిషనరేట్లకు చెందిన పెండింగ్ డేటాను ఇంటిగ్రేడ్ చేయడం, బకాయిదారులకు సంక్షిప్త సందేశాలు పంపడం, రహదారులపై పీడీఏ మిషన్ల ద్వారా తనిఖీలు చేసి చర్యలు తీసుకోవడం, ఎక్కువ సంఖ్యలో పెండింగ్ చలాన్లు ఉన్న వారిపై న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేయడం తదితర చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఓపక్క ఉల్లంఘనల్ని నిరోధించడం ... మరోపక్క ఈ-చలాన్ బకాయిలు వసూలు చేయడం సాధ్యమవుతుందని అధికారులు చెప్తున్నారు. టెండర్ల దశను పూర్తి చేసుకున్న ఏఆర్‌డీవీసీఎస్ విధానం వచ్చే నెల నుంచి పని చేయడం ప్రారంభించనుంది. ఇలాంటి టెక్నాలజీ అనుసంధానిత విధానాల వల్ల వాహనచోదకులతో ట్రాఫిక్ సిబ్బందికి ఘర్షణలు, వాగ్వాదాలకూ అస్కారం ఉండదని అధికారులు చెప్తున్నారు. నగర వ్యాప్తంగా 100 చోట్ల... ఆటోమేటిక్ రాంగ్ డెరైక్షన్ వైలేషన్ క్యాప్చర్ సిస్టం (ఏఆర్‌డీవీసీఎస్)గా పిలిచే ఈ సాఫ్ట్‌వేర్‌ను బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ సర్వర్‌లో నిక్షిప్తం చేస్తారు. దీన్ని నగరంలో ఈ తరహా ఉల్లంఘనలకు అవకాశం ఉన్న జంక్షన్లలో ఇప్పటికే ఉన్న సర్వైలెన్స్ కెమెరాలను అనుసంధానిస్తారు. జంక్షన్లు కాకుండా ఇతర చోట్ల ఈ ఉల్లంఘనలు జరుగుతున్న ప్రాంతాల్లో కొత్తగా కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఇలా నగర వ్యాప్తంగా 100 చోట్ల ఉండే కెమెరాలన్నీ కంట్రోల్ రూమ్‌లోని సర్వర్‌కు అనుసంధానిస్తారు. ఈ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ప్రత్యేక ప్రోగ్రామింగ్ ఆయా మార్గాల్లో నిర్దేశించిన రూట్లలో కాకుండా వాటికి వ్యతిరేకంగా వచ్చే వాహనాలను గుర్తించి, ఫొటో తీసి, కంట్రోల్‌రూమ్ సర్వర్‌కు పంపుతుంది. అక్కడ ఈ-చలాన్‌ను జనరేట్ చేసి వాహనచోదకుల చిరునామాకు పంపేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. -
తుపానుకు తెగిన చెరువులు.. కుంటలు
సాక్షి, నల్లగొండ: జిల్లాలో చెరువులు ఎంత పటిష్టంగా ఉన్నాయో ఇటీవల కురిసిన వర్షాలే స్పష్టం చేశాయి. చెరువు కట్టల నాణ్యతలో ఉన్న డొల్లతనం కళ్లకు కట్టినట్టు కనబడుతోంది. వర్షాకాలం వచ్చినా పట్టించుకోలేదు. వర్షాలు కురిసే నాటికే చెరువులకు పకడ్బందీగా పనులు చేపట్టాల్సి ఉండగా నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవ ర్తించారు. కొన్నిచోట్ల చేసిన మరమ్మతుల్లో నాణ్యత మచ్చుకైనా కనిపించడం లేదు. దీని ఫలితంగానే వందకుపైగా చెరువులు, కుంటల కట్టలకు గండ్లు పడి తెగిపోయాయి. ఈ వరద ఉధ్ధృతికి దిగువ ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు నామరూపాల్లేకుండా పోయాయి. జిల్లాలో 27వ తేదీ వరకు 385 చెరువులు, కుంటలు, ఫీడర్ ఛానళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు లెక్కగట్టారు. సోమవారం కూడా మరో 35 చెరువులు, కుంటలకు గండ్లు పడ్డట్టు తెలిసింది. ఈ మొత్తంలో 200కు పైగా పూర్తిగా కట్టలు తెగిపోయాయని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈ లెక్కన నీటిపారుదల శాఖకు *36 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. కట్టలు తెగిపోవడంతో పారిన వరదలు పంటపొలాలు, గ్రామాలను ముంచెత్తాయి. వ్యవసాయ మోటార్లు, మూగజీవాలు కొట్టుకుపోయాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ కారణంగా వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ముఖ్యంగా అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అప్పటికే పరిస్థితి చేజారింది చెరువులు, కట్టలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని సమాచారం అందడం వాస్తవమే. దీంతో మేం కొన్నిచోట్ల ఎటువంటి ముప్పు వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. శాయశక్తులా కృషి చేశాం. అయితే కొన్ని గ్రామాల్లో చర్యలు తీసుకునే అవకాశం లేకపోయింది. భారీగా కురుస్తున్న వర్షాలు, చెరువులకు యంత్రాలు వెళ్లలేని స్థితి పనులకు ఆటంకం కలిగించింది. అప్పటికే వరద ఉద్ధృతంగా రావడంతో పరిస్థితి చేజారిపోయింది. కట్టలు తెగిపోవడం విచారకరం. - హమీద్‌ఖాన్, నీటి పారుదల శాఖ ఈఈ నాణ్యత నగుబాటు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఆర్జాలబావిలోని వల్లభరావు చెరువుకు ఇటీవలే మరమ్మతులు చేపట్టారు. ఆర్ఆర్ఆర్ (మరమ్మతులు, పునరుద్ధరణ, పునర్నిర్మాణం) నిధుల కింద *8 లక్షలు ఖర్చు చేసి చెరువు కట్టను అభివృద్ధి చేశారు. ఈ పనుల్లో ఎక్కడా నాణ్యత కనబడడం లేదు. కేవలం పైపై మెరుగులు దిద్ది చేతులు దులుపుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కట్ట అక్కడక్కడా కుంగిపోయింది. చివరకు నిలువలేక పోయింది. గండి పడి నీరంతా పొలాల్లో పారడంతో వరిపైరంతా తుడిచిపెట్టుకుపోయింది. అంతేగాక సమీపంలోని అర్బన్ కాలనీ, పానగల్‌లోని సగం ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని దెబ్బతిన్నాయి. చిరువ్యాపారుల బతుకులు చిన్నాభిన్నమయ్యాయి. రెండు రోజుల పాటు వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. సమాచారం ఇచ్చినా... ఈ సీజన్లో ముందు కురిసిన వర్షాలతోనే తిప్పర్తి మండలం చెరువుపల్లి చెరువు పూర్తిగా నిండి అలుగు పోసింది. చెరువుకట్ట ప్రమాద స్థితిలో ఉందంటూ రైతులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కట్ట పరిస్థితిని తెలియజేసే ఫొటోలు సైతం అధికారులకు పంపించారు. అయినా అధికారులు నిద్రమబ్బు వీడలేదు. దీంతో రైతులే స్వయంగా ఇసుక సంచులు కట్టకు సపోర్టుగా వేశారు. ఇలా నెలరోజుల పాటు బాగానే ఉంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వచ్చిన వరదతో కట్టకు గండిపడింది. దీంతో నీరంతా దిగువ ప్రాంతాల్లో ఉన్న వరిపైరును నేలమట్టం చేసింది. పంటపొలాల్లో ఎక్కడ చూసినా ఇసుక మేటలు ఏర్పడ్డాయి. దాదాపు 300ఎకరాల్లో వరిపైరు చేతికి రాకుండా పోయింది. మరో 100ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది.