ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనపై నిందితుడు సాగర్ శర్మ తల్లి స్పందించారు. ఈ ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. తన కుమారుడు అమాయకుడని, తప్పుదోవ పట్టించి, కుట్రలో ఇరుకించారని ఆరోపించారు. సాగర్ దేశ భక్తి గల వ్యక్తి అని చెప్పారు.
'స్నేహితున్ని కలవడానికి ఢిల్లీకి వెళుతున్నట్లు చెప్పాడు. రెండ్రోజుల్లో వస్తానని అన్నాడు. నా కొడుకుని ఎవరో కుట్రలో ఇరికించారు. ఆటో నడిపేవాడు. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడే నా ఆధారం. ప్రతి రోజు దాదాపు రూ.500 వరకు సంపాదించేవాడు. చాలా అమాయకుడు. మంచి వ్యక్తిత్వం గలవాడు. దేశం పట్ల ఎప్పుడు భక్తిభావంతో ఉండేవాడు. ఇలాంటి పనులు ఎప్పుడు చేయడు. ఎవరో అతనికి ఇవన్నీ నూరిపోశారు. కుట్రలో ఇరికించారు.' అని సాగర్ తల్లి రాణి శర్మ అన్నారు.
కేసులో నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని సాగర్ సోదరి మహి శర్మ కోరారు. తన సోదరున్ని ఈ కేసులో ఇరికించిన వారిని కఠినంగా శిక్షించాలి అని ప్రధాని మోదీకి విన్నవించారు.' నా సోదరుడు ఇంటర్ వరకు చదువుకున్నాడు. మంచి దేశ భక్తుడు. దేశ అభివృద్ధి గురించి మాట్లాడేవాడు. ఆగష్టు 15కు ఆటోపై మూడు రంగుల జెండా పెట్టుకునేవాడు' అని సాగర్ సోదరి మహి శర్మ తెలిపింది.
Parliament intruder's mother and sister claim his innocence, says he is getting framed, appeals for fair probe
— ANI Digital (@ani_digital) December 14, 2023
Read @ANI Story | https://t.co/A0OYCYyaoa#Parliament #SecurityBreach #Intruders pic.twitter.com/veM1JR1iNv
అయితే.. నిందితులందరూ సోషల్ మీడియా పేజీ 'భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్'తో సంబంధం కలిగి ఉన్నారని పోలీసులు తెలిపారు. ఏడాదిన్నర క్రితం అందరూ మైసూరులో కలిశారు. సాగర్ జూలైలోనే లక్నో నుంచి వచ్చాడు.. కానీ పార్లమెంట్ హౌజ్ లోపలికి వెళ్లలేకపోయాడు. డిసెంబర్ 10 నుంచి నిందితులందరూ ఒక్కొక్కరిగా ఢిల్లీకి చేరుకున్నారు. ఇండియా గేట్ వద్ద గ్యాస్ క్యానిస్టర్లను పంచుకున్నారని పోలీసులు గుర్తించారు.
లక్నోలోని మానక్‌నగర్ ప్రాంతంలో సాగర్ శర్మ నివాసం ఉంటున్నాడు. వామపక్ష భావాజాలంతో ఫేస్‌బుక్ పోస్టులు చేస్తుండేవాడని పోలీసులు గుర్తించారు. కోల్‌కతా, హర్యానా, రాజస్థాన్‌కు చెందిన చాలా మందితో సాగర్ శర్మకు సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా ఆయన ఫేస్‌బుక్ పేజీలో యాక్టివ్‌గా లేరని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా నుంచి లక్నోకు వలస వచ్చిన సాగర్ కుటుంబం.. ఇక్కడే గత 20 ఏళ్ల నుంచి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. తండ్రి, తల్లి, సోదరితో సాగర్ ఉంటున్నాడని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: Parliament: గ్యాస్ క్యానిస్టర్లు అంటే ఏంటి? ఎక్కడైనా వాడొచ్చా?
Comments
Please login to add a commentAdd a comment