![BJP MP Pratap Simha On Issue Passes To Parliament Breach Accused - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/14/pratapsimha_img.jpg.webp?itok=5OoCl8if)
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనలో నిందితులు కర్ణాటక ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం నుంచి విజిటర్ పాస్‌లను పొందారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లాను ప్రతాప్ సింహ నేడు కలిశారు. నిందితులకు పాస్‌లను ఇవ్వడానికి గల కారణాన్ని ఆయన వివరించారు. పార్లమెంట్ విజిటర్ పాస్ కోసం నిందితుల్లో ఒకరి తండ్రి తన కార్యాలయానికి వచ్చారని స్పీకర్‌కు తెలిపారు. పాస్‌ల కోసం నిందితుడు సాగర్ శర్మ నిరంతరం తన పీఏకి టచ్‌లోనే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంతకు మించిన సమాచారం తన వద్ద లేదని స్పీకర్‌కు వివరించినట్లు సమాచారం.
మనోరంజన్, సాగర్ శర్మ, నీలమ్, అమోల్ శిందె, విశాల్, లలిత్ అనే ఆరుగురు దుండగులు ఈ ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో మనోరంజన్, సాగర్‌శర్మ లోక్‌సభలోకి చొరబడగా.. నీలమ్, అమోల్ శిందే పార్లమెంట్ భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితో పాటు వీరికి సహకరించిన విశాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా లలిత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
పార్లమెంట్‌లో బుధవారం గందరగోళం నెలకొంది. పక్కా ప్రణాళికతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన నిందితులు గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు నిందితులు లోక్‌సభ లోపలికి ప్రవేశించి పసుపు రంగు గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో ఎంపీలంతా భయాందోళనకు గురయ్యారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి జరిగిన రోజే మళ్లీ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది.
ఇదీ చదవండి: Parliament: గ్యాస్ క్యానిస్టర్లు అంటే ఏంటి? ఎక్కడైనా వాడొచ్చా?
Comments
Please login to add a commentAdd a comment