రాంగ్ రూట్‌పై నజర్ | Nazar on Wrong Root | Sakshi
Sakshi News home page

రాంగ్ రూట్‌పై నజర్

Published Thu, Dec 17 2015 12:18 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 PM

రాంగ్ రూట్‌పై నజర్

రాంగ్ రూట్‌పై నజర్

ఆధునిక టెక్నాలజీ  వినియోగించనున్న ట్రాఫిక్ కాప్స్
నగరంలో 100 చోట్ల కెమెరాల ఏర్పాటు
‘ఉల్లంఘనులకు’ జనవరి నుంచి ఈ-చలాన్లు

 
‘తొంబై తొమ్మిది సార్లు ఉల్లంఘించినా ఏ ఇబ్బందీ రాకపోవచ్చు... వందోసారైనా మూల్యం చెల్లించక తప్పదు’ ట్రాఫిక్ ఉల్లంఘనల విషయంలో అధికారులు పదేపదే చెప్పే మాట ఇది. ఈ మూల్యం ఉల్లంఘనకు పాల్పడిన వాహనచోదకుడు చెల్లిస్తే ఒక ఎత్తు. అదే... ఏ పాపం ఎరుగని ఎదుటి వ్యక్తిపై ప్రభావం చూపితే... ఆ కుటుంబం బాధ, వ్యధ వర్ణనాతీతం. ప్రస్తుతం నగరంలో నిత్యం అనేక కుటుంబాలు ఈ క్షోభను అనుభవిస్తున్నాయి. ఉల్లంఘనులు ‘పొరపాటుగా’ అని భావించే అనేక అంశాలు బాధితుల పాలిటి గ్రహపాటుగా మారుతున్నాయి. ఇలాంటి ‘పొరపాట్ల’లో రాంగ్ రూట్..., నో ఎంట్రీ  మార్గాల్లోకి వాహనాలతో రావడం ప్రధానమైంది.
 
నిర్లక్ష్యంతో కూలిపోతున్న కుటుంబాలు..
నగరంలో ఇలా రాంగ్ రూట్/నో ఎంట్రీ మార్గాల్లో దూసుకుపోతూ ప్రమాదాలకు గురికావడంతో పాటు వాటికి కారకులుగా మారుతున్న ఉదంతాలు ఎన్నో ఉంటున్నాయి. కాస్తదూరం ముందుకు వెళ్లి ‘యూ టర్న్’ తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్న వాహనచోదకులు... అది వన్ వే అని ... రాంగ్ రూట్  అని తెలిసి కూడా దూసుకుపోతున్నారు. నో ఎంట్రీ మార్గాలనూ వీరు వదలట్లేదు. ఇలాంటి వాహనచోదకులు నిత్యం చిన్న చిన్న ప్రమాదాలకు లోనవడంతో పాటు కారకులవుతున్నారు.  కొన్ని సందర్భాల్లో ఎదుటి వారి ఉసురు తీసి వారి కుటుంబాన్నే కకలావికలం చేస్తున్నారు. 2013లో జరిగిన ముషీరాబాద్ ఏఎస్సై సత్యనారాయణ మరణమే దీనికి నిదర్శనం.
 
ఇప్పటి వరకు బారికేడ్లు, కెమెరాలతో...

సిటీలోని అనేక జంక్షన్లతో పాటు కొన్ని కీలక ప్రాంతాల్లో ఈ రాంగ్ రూట్, నో ఎంట్రీ ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయి.  వీటిని పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆయా చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసినా ఉల్లంఘనుల్ని అడ్డుకోలేకపోతున్నారు. దీంతో కెమెరాలతో కానిస్టేబుళ్లు, హోంగార్డుల్ని మోహరిస్తున్నారు. వీరు ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడే వారి వాహనాలను ఫొటోలు తీసి, ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఈ-చలాన్ పంపుతున్నారు. అయితే అన్ని వేళల్లో, ప్రధానంగా రాత్రిపూట ఈ పాయింట్లలో సిబ్బంది లేకపోవడంతో ఉల్లంఘనులు రెచ్చిపోయి తమ ప్రాణాలు పోగొట్టుకోవడం లేదా ఇతరుల ప్రాణాలు తీయడం చేస్తున్నారు. దీనికి పరిష్కారంగానే ట్రాఫిక్ పోలీసు విభాగం ఏఆర్‌డీవీసీఎస్ పరిజ్ఞానాన్ని అమలులోకి తెస్తోంది.
 
వచ్చే నెల నుంచి అందుబాటులోకి...

ఈ తరహా ఈ-చలాన్లు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచేసే వాహనచోదకులపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రెండు కమిషనరేట్లకు చెందిన పెండింగ్ డేటాను ఇంటిగ్రేడ్ చేయడం, బకాయిదారులకు సంక్షిప్త సందేశాలు పంపడం, రహదారులపై పీడీఏ మిషన్ల ద్వారా తనిఖీలు చేసి చర్యలు తీసుకోవడం, ఎక్కువ సంఖ్యలో పెండింగ్ చలాన్లు ఉన్న వారిపై న్యాయస్థానంలో చార్జ్‌షీట్లు దాఖలు చేయడం తదితర చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఓపక్క ఉల్లంఘనల్ని నిరోధించడం ... మరోపక్క ఈ-చలాన్ బకాయిలు వసూలు చేయడం సాధ్యమవుతుందని అధికారులు చెప్తున్నారు. టెండర్ల దశను పూర్తి చేసుకున్న ఏఆర్‌డీవీసీఎస్ విధానం వచ్చే నెల నుంచి పని చేయడం ప్రారంభించనుంది. ఇలాంటి టెక్నాలజీ అనుసంధానిత విధానాల వల్ల వాహనచోదకులతో ట్రాఫిక్ సిబ్బందికి ఘర్షణలు, వాగ్వాదాలకూ అస్కారం ఉండదని అధికారులు చెప్తున్నారు.
 
నగర వ్యాప్తంగా 100 చోట్ల...
 ఆటోమేటిక్ రాంగ్ డెరైక్షన్ వైలేషన్ క్యాప్చర్ సిస్టం (ఏఆర్‌డీవీసీఎస్)గా పిలిచే ఈ సాఫ్ట్‌వేర్‌ను బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ సర్వర్‌లో నిక్షిప్తం చేస్తారు. దీన్ని నగరంలో ఈ తరహా ఉల్లంఘనలకు అవకాశం ఉన్న జంక్షన్లలో ఇప్పటికే ఉన్న సర్వైలెన్స్ కెమెరాలను అనుసంధానిస్తారు. జంక్షన్లు కాకుండా ఇతర చోట్ల ఈ ఉల్లంఘనలు జరుగుతున్న ప్రాంతాల్లో కొత్తగా కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఇలా నగర వ్యాప్తంగా 100 చోట్ల ఉండే కెమెరాలన్నీ కంట్రోల్ రూమ్‌లోని సర్వర్‌కు అనుసంధానిస్తారు. ఈ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ప్రత్యేక ప్రోగ్రామింగ్ ఆయా మార్గాల్లో నిర్దేశించిన రూట్లలో కాకుండా వాటికి వ్యతిరేకంగా వచ్చే వాహనాలను గుర్తించి, ఫొటో తీసి, కంట్రోల్‌రూమ్ సర్వర్‌కు పంపుతుంది. అక్కడ ఈ-చలాన్‌ను జనరేట్ చేసి వాహనచోదకుల చిరునామాకు పంపేలా అధికారులు చర్యలు తీసుకుంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement