
పెద్దలనూ వదలబోం: జస్టిస్ ఎంబీ షా
* నల్లధనం కేసులపై సత్వర విచారణ
* వీలైనంత త్వరగా పని ముగిస్తాం
* తన ట్రాక్ రికార్డే నిదర్శనమన్న షా
అహ్మదాబాద్: నల్లధనం సంబంధిత కేసుల్లో ఎవరినీ వదిలేది లేదని సిట్ చైర్మన్ జస్టిస్ ఎం.బి.షా ప్రకటించారు. రాజకీయ పెద్దలు, కార్పొరేట్ ప్రముఖులు నల్లధనాన్ని విదేశాల్లో పోగేసినట్టు తేలితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన సారథ్యంలో సిట్ ఏర్పాటుకు మంగళవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న అనంతరం ఆయన పీటీఐ వార్తా సంస్థతో ఫోన్‌లో మాట్లాడారు. పలువురు నేతలు, కార్పొరేట్ పెద్దలు విదేశాల్లో భారీగా నల్లధనాన్ని దాచుకున్నారన్న వార్తల నేపథ్యంలో వారి విషయంలో ఎలా వ్యవహరిస్తారన్న ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.
‘‘నేను చాలా ఏళ్లపాటు న్యాయమూర్తిగా ఉన్నాను. 15 ఏళ్లు హైకోర్టులో, ఐదేళ్లు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పని చేశాను. వ్యక్తులను, వారి పరపతి తదితరాలను ఏనాడూ లెక్క చేయలేదు. అందుకే అలాంటి విషయాల్లో నన్ను సంప్రదించేందుకు కూడా ఎవరూ సాహసించలేదు’’ అని గుర్తు చేశారు.
‘‘ఇప్పుడు కూడా అంతే. కాబట్టి నల్లధనంపై విచారణ విషయంలో ఎవరూ సందేహించాల్సిన పని లేదు’’ అంటూ భరోసా ఇచ్చారు. అయితే ఈ ఉదంతంలో సంక్లిష్టమైన అంశాలెన్నో ఉన్నాయని జస్టిస్ షా అభిప్రాయపడ్డారు. అయినా విచారణ వేగవంతంగా జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా తాము పని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఒడిశా, గోవాల్లో అక్రమ మైనింగ్‌పై వేసిన కమిషన్‌కు సారథిగా కేవలం రెండు నెలల్లో తొలి మధ్యంతర నివేదిక సమర్పించానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశించింది గనుక సిట్‌ను కేంద్రం ఏర్పాటు చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. అంతకంటే మరోదారి లేకపోయిందన్నారు. నల్లధనాన్ని వెలికితీయడం కొత్త ప్రభుత్వానికి కూడా తప్పనిసరేనని అభిప్రాయపడ్డారు.