నోట్లపై కూడా ఉప్పులాగే వదంతులు: వెంకయ్య
ఉన్నట్టుండి ఉప్పు కొరత ఏర్పడిందంటూ వదంతులు వచ్చాయని, అవి ఎంత అబద్ధమో.. నోట్ల విషయంలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయన్నది కూడా అంతే అబద్ధమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొంతమేర సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని తీర్చడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోస్టాఫీసులలో నోట్లు మార్చుకోడానికి అన్ని ఏర్పాట్లు చేశామని, అలాగే 1.20 లక్షల మంది బ్యాంకుమిత్ర (బ్యాంకింగ్ కరస్పాండెంట్లు) కూడా త్వరలోనే యాక్టివేట్ అవుతారని ఆయన చెప్పారు.
ఉప్పు కొరత గురించిన వదంతులపై కూడా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించామని, దేశవ్యాప్తంగా 220 లక్షల టన్నుల ఉప్పు ఉత్పత్తి అవుతుండగా కేవలం 60 వేల టన్నులు మాత్రమే గృహ వినియోగానికి వెళ్తుందని.. మిగిలినదంతా పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తారని ఆయన వివరించారు. ఇలాంటి వాటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పనికిమాలిన ఆరోపణలు చేసేవాళ్లు మాట్లాడుతూనే ఉంటారని, వారికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని వెంకయ్యనాయుడు చెప్పారు. ఎవరికి ఎవరు మద్దతిచ్చినా తమకు మాత్రం భయం లేదన్నారు. ప్రజలు అవినీతిపరులకు మద్దతు ఇవ్వడంలేదని, నిజాయితీపరులకే మద్దతిస్తున్నారని స్పష్టం చేశారు. నోట్ల రద్దు అంశానికి కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతిచ్చాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారన్నారు. ఇది తన విజయం కాదని.. దీనికి మద్దతిచ్చిన అన్ని పార్టీలదని ప్రధాని చెప్పారన్నారు.