నోట్లరద్దుపై ఆ పార్టీలన్నీ ఏకమైనా..
మా ప్రభుత్వానికేం ముప్పులేదు: వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు అంశంపై ప్రతిపక్షాలన్నీ ఏకమైనా.. దానివల్ల బీజేపీ నేతృత్వంలోని తమ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల లోపు రాజకీయ పునరేకీకరణకు అవకాశమే లేదని ఆయన కొట్టిపారేశారు.
ప్రధాని నరేంద్రమోదీకి లభిస్తున్న ప్రజాదరణను చూసి అక్కస్సుతోనే ప్రతిపక్ష పార్టీలు గ్రూపులు కడుతున్నాయని, ఇవి అవకాశవాద రాజకీయాలని, ఇలాంటి రాజకీయాలు విజయం సాధించలేవని అన్నారు. పీటీఐ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన వెంకయ్య నోట్లరద్దుపై ప్రతిపక్షాలు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు.
'ప్రారంభంలో వారు (ప్రతిపక్షాలు) నోట్లరద్దును స్వాగతించడంలో పోటీపడ్డారు. అనంతరం దీనివల్ల మోదీ మరింత ప్రజాదరణ పొందుతున్నారని గుర్తించి.. రంధ్రాన్వేషణ చేస్తూ విమర్శించడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ అంశం ఆధారంగా రాజకీయ పునరేకీకరణకు అవకాశముందా అని మీడియాలోని వ్యక్తులు అంటున్నారు' అని వెంకయ్య పేర్కొన్నారు. ప్రతిపక్షాల నేతలు ప్రజల మధ్యలోకి వెళ్లడం లేదని, కేవలం వాళ్లు టీవీ స్టూడియోలకు వెళ్లి వ్యాఖ్యలు చేస్తున్నారని వెంకయ్య విమర్శించారు.