నేను సారీ చెప్పను గాక చెప్పను: ఎంపీ
కుక్కతోక వంకర.. ఎంత తీసినా రాదు అంటారు పెద్దలు. ఇప్పటికి దాదాపు ఏడెనిమిది సార్లు విమానం టికెట్లు రద్దు చేసినా ఇప్పటికీ శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌కు మాత్రం బుద్ధి మార లేదు. తాను చెప్పుతో కొట్టిన ఎయిరిండియా మేనేజర్ సుకుమార్‌కు క్షమాపణ చెప్పేది లేదని, పార్లమెంటుకు మాత్రం క్షమాపణ చెబుతానని అంటున్నారు. అంతేకాదు, తనను అవమానించిన సుకుమార్ పిచ్చోడని, అతడి మీద ఇలాంటì వి దాదాపు ఎనిమిది కేసులు నమోదై ఉన్నాయని అన్నారు. ఎయిరిండియా ఉద్యోగే ముందుగా తనతో గొడవ పడ్డాడని, అలాంటప్పుడు తాను ఎందుకు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. తన చర్యల వల్ల పార్లమెంటు గౌరవానికి భంగం కలిగినట్లయితే పార్లమెంటుకు మాత్రమే క్షమాపణ చెబుతానన్నారు.
తన మీద విధించిన ఫ్లయింగ్ బ్యాన్‌కు కూడా అర్థం లేదని, ఎందుకంటే విమానయాన సంస్థలకు ఏ ప్రయాణికుడినీ నిషేధించే హక్కు లేదని కూడా రవీంద్ర గైక్వాడ్ అన్నారు. తాను చెప్పిన విషయాలను ఎవరూ పట్టించుకోలేదని, ఒక ప్రజాప్రతినిధి విషయంలోనే ఎయిరిండియా ఇలా ప్రవర్తిస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. పౌర విమానయాన మంత్రి అశోక గజపతి రాజు నుంచి విజ్ఞప్తి అందడంతో ఎయిరిండియా రవీంద్ర గైక్వాడ్ మీద నిషేధం ఎత్తేసిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఎయిరిండియాతో పాటు ఆరు ప్రైవేటు విమానయాన సంస్థలు కూడా రవీంద్ర గైక్వాడ్ మీద నిషేధం విధించిన విషయం తెలిసిందే.